ఆగస్టు 15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలన్ని పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

ఆగస్టు 15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలన్ని పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

నల్లగొండ: 2025, ఆగస్టు15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం (జూన్ 9) మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పులకు మేం నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పేదవాడు బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 

ALSO READ | CM చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్‎ను అడ్డుకుని తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి

పేద వాడి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవడమని.. ఆ కలను కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందన్నారు. రాష్ట్రంలో తొలి విడతగా నియోజక వర్గానికి 3500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్ళు మంజూరు చేశామని పేర్కొన్నారు. 20 లక్షల ఇళ్లు నిర్మించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని.. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ధరణికి పోర్టల్‎కి భూ భారతికి చాలా తేడా ఉందని.. అధికారులు దేశవ్యాప్తంగా పర్యటించి ఎటువంటి లోపాలు లేకుండా అద్భుతమైన చట్టాన్ని రూపొందించారని చెప్పారు. 

రెవెన్యూ అధికారులు మీ ఇంటికి వచ్చి ఏవైనా సమస్యలు ఉంటే సరి చేస్తారని.. మీరు ఎటు తిరగవలసిన అవసరం లేదన్నారు. భూ భారతి చట్టం భవిష్యత్తులో దేశానికే రోల్ మోడల్‎గా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక భూములు కబ్జాలు చేశారని.. అవన్నీ వెనక్కి తీసుకుని వస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రూ.21 వేలకోట్లు రుణ మాఫీ చేశామని.. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన ఋణ మాఫీ కేవలం రూ.17 వేల కోట్లేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామన్నారు.