CM చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్‎ను అడ్డుకుని తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి

CM చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్‎ను అడ్డుకుని తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న బనకచర్ల ప్రాజెక్ట్‏ను ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్‎ను అడ్డుకుని తీరుతామని తేల్చిచెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు. సోమవారం (జూన్ 9) మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్పాడని ఆరోపించారు. 

ALSO READ | కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు.. హరీశ్ చెప్పిన సమాధానాలివే..

పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో  అక్రమాలకు పాల్పడ్డాడని.. ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడని విమర్శించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తిచేసి నీళ్లు అందిస్తామన్నారు. సొంత బిడ్డే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తుంది. అయినా కేసీఆర్‎కు ఇంకా జ్ఞానోదయం కలగట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి తీరుతామని.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కలను నెరవేస్తుందన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ ఎండబెట్టారని మండిపడ్డారు. తాను మంత్రి అయ్యాక ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.1600 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా చేస్తుందన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‎గా తీసుకోవడంతో.. బీఆర్ఎస్ డైరెక్షన్‎లో దాక్కున్న ప్రభాకర్ రావు బయటికి వచ్చిండని ఆరోపించారు.