
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు సిట్ విచారణ ముగిసింది. సోమవారం (జూన్ 9) విచారణకు వచ్చిన ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కేసుకు సంబంధించిన ప్రశ్నలతో ప్రభాకర్ రావును ఉక్కిరి బిక్కిరి చేశారు పోలీసులు. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మళ్లీ జూన్ 11న విచారణకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు సిట్ అధికారులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు ప్రణీతరావును త్వరగా ప్రమోషన్ చేయాలని ఎవరు రికమెండ్ చేశారు..?
మీరు, ప్రణీత్ రావ్, శ్రవణ్ రావు ముగ్గురు తరచుగా ఎందుకు భేటీ అయ్యేవారు..? శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి అతనికి ఎస్ఐబీతో సంబంధాలే ఏంటి..? అని పోలీసులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ప్రభాకర్ రావు మాత్రం తన అఫిడవిట్ లోని అంశాలనే తిరిగి చెప్పినట్లు తెలిసింది. అసలు తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధమే లేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని ఇన్విస్టిగేషన్ ఆఫీసర్లనే ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం..నేను ఆదేశాలిచ్చినట్టు ఆధారాలుంటే చూపండి
గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ ఆయనను విచారించింది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ అమల్లో ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీం కోర్టు ఆర్డర్, వన్ టైం ఎంట్రీకి అనుబంధమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్ సహా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ ఆఫీస్‌కు చేరుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సహా ఐదుగురు సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారించింది.
సిట్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలు:
- ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు..?
- హార్డ్‌డిస్క్‌లను ఎవరు ధ్వంసం చేశారు..?
- మీ ఆదేశాలతోనే ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారా..?
- స్పెషల్ ఆపరేషన్ టీంను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు..?
- హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది..?
- శ్రవణ్‌రావుకు, SIBతో సంబంధం ఏంటి..?