మాల జాతి కోసం కొట్లాడిన విష్ణుమూర్తి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మాల జాతి కోసం కొట్లాడిన విష్ణుమూర్తి : మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: పోలీస్ శాఖలో ఏసీపీగా పని చేసిన విష్ణుమూర్తి మృతి ప్రభుత్వానికి, మాల జాతికి తీరని లోటని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. లతా రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో ఏసీపీ విష్ణుమూర్తి సంతాప సభ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విష్ణుమూర్తి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విష్ణుమూర్తి మాల జాతి కోసం ధైర్యంగా కొట్లాడారన్నారు. దీంతో ఆయనకు ఎన్నో మెమోలు ఇచ్చినా పట్టించుకోకుండా నిత్యం మాల జాతి కోసం ఆలోచించేవారన్నారు. అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న మాలలకు అండగా నిలిచారన్నారు. విష్ణుమూర్తిని ఆదర్శంగా తీసుకొని మాలలు ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. విష్ణుమూర్తి కుటుంబానికి మనమంతా అండగా నిలవాలన్నారు.