అంతరిక్షంలోకి 4 వేల 410 కిలోల శాటిలైట్.. జీశాట్ 7ఆర్ విజయవంతంగా కక్ష్యలోకి..

అంతరిక్షంలోకి 4 వేల 410 కిలోల శాటిలైట్.. జీశాట్ 7ఆర్ విజయవంతంగా కక్ష్యలోకి..
  • స్వదేశీ గడ్డపై నుంచి తొలిసారి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం 
  • జీశాట్ 7ఆర్​ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ‘బాహుబలి’ రాకెట్ 
  • హిందూ మహాసముద్రంలో నేవీ కమ్యూనికేషన్​కు కీలకం కానున్న శాటిలైట్

శ్రీహరి కోట: భారత భూభాగం నుంచి తొలిసారిగా అతి బరువైన శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 4,410 కిలోల బరువైన సీఎంఎస్03(జీశాట్ 7ఆర్) ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ ఎల్వీఎం3–ఎం5 (జీఎస్ఎల్వీ మార్క్ 3) సక్సెస్ ఫుల్ గా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు జరిగిన ఈ ప్రయోగంతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన ఎల్వీఎం3 రాకెట్ 16 నిమిషాల్లో శాటిలైట్ ను నిర్దేశిత జీటీవో (జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్)లోకి చేర్చింది. దీంతో స్వదేశీ గడ్డపై నుంచి అతి బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఈ మిషన్ తో ఇస్రో నాంది పలికినట్టయింది.

జీశాట్ 7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానంలో కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. హిందూ మహాసముద్రంలో నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్ లు, సబ్ మెరైన్ లు, తీర ప్రాంతంలోని కమాండ్ సెంటర్ల మధ్య సమర్థమైన కమ్యూనికేషన్ సేవలను సీఎంఎస్03 శాటిలైట్ అందించనుంది. ఇందుకోసం దీనిలో సీ, ఎక్స్ టెండెడ్ సీ, కేయూ బ్యాండ్ పేలోడ్లను అమర్చారు. ప్రయోగం అనంతరం మిషన్ కంట్రోల్ రూం నుంచి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ మాట్లాడారు. జీశాట్ 7ఆర్ ఉపగ్రహం 15 ఏండ్ల పాటు సేవలు అందించనుందని తెలిపారు. శాటిలైట్ ను దశలవారీగా కక్ష్యను పెంచుతూ గమ్యస్థానానికి చేర్చనున్నట్టు వెల్లడించారు. 

క్రయోజెనిక్ ఎక్స్ పరిమెంట్ కూడా విజయవంతం..
తాజా మిషన్ తో ఇస్రో బాహుబలి రాకెట్ ఎల్వీఎం3 మరోసారి సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ‘‘ఇప్పటివరకూ చంద్రయాన్ 3 వంటి ప్రతిష్టాత్మక మిషన్లను ఈ రాకెట్ తో సక్సెస్ చేశాం. మొత్తం 8 సార్లు ఈ రాకెట్ ను ప్రయోగించగా, వంద శాతం సక్సెస్ రేటును సాధించింది” అని చెప్పారు. సుమారు 2,200 కిలోల బరువైన శాటిలైట్లను అంతరిక్షానికి చేర్చగల జీఎస్ఎల్వీ రాకెట్ క్రయోజెనిక్ స్టేజ్ కు మార్పులు చేసి, ఎల్వీఎం03 రాకెట్ ను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.

తాజా ప్రయోగంలో రాకెట్ క్రయోజెనిక్ ఇంజన్ ను రెండోసారి కూడా మండించడం ద్వారా కీలక ఎక్స్ పరిమెంట్ ను కూడా విజయవంతంగా చేపట్టామన్నారు. క్రయోజెనిక్ స్టేజ్ ను రీఇగ్నైట్ చేయడం ద్వారా శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లోకి పంపేందుకు వీలవుతుందన్నారు. కాగా, చివరిసారిగా 2023లో ఎల్వీఎం3 రాకెట్ ద్వారా 3,841 కిలోల బరువైన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.