
- హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేత
- కొత్త స్లాబులకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం
- ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తింపు
- 12% స్లాబ్‌లో ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూస్‌లు, డ్రైఫ్రూట్స్ వంటివి 5 శాతం స్లాబ్‌లోకి
- 28% స్లాబ్‌లో ఉన్న ఏసీలు, టీవీలు, ప్రిజ్‌లు, సిమెంట్ వంటివి 18 శాతంలోకి
- పాన్ మసాలా, సిగరెట్లు, కూల్ డ్రింక్స్, హైఎండ్ కార్లపై ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్
న్యూఢిల్లీ: జీఎస్‌టీలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ 5, 12, 18, 28 శాతాల్లో నాలుగు రకాలుగా ఉన్న ట్యాక్స్ స్లాబ్‌లను ఇకపై 5 శాతం, 18 శాతం స్లాబ్‌లకే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హెయిర్ ఆయిల్ నుంచి మొదలుకుని కార్న్ ఫ్లేక్స్, టీవీల వరకు అన్ని కామన్ యూజ్ ఐటమ్స్‌పై పన్నులను తగ్గించింది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై పూర్తిగా జీఎస్‌టీని ఎత్తివేసింది. బుధవారం ఢిల్లీలో సుదీర్ఘంగా సాగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కౌన్సిల్ సమావేశంలో అన్ని నిర్ణయాలనూ ఏకగ్రీవంగా ఆమోదించామని, ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏ అంశాన్నీ వ్యతిరేకించలేదని తెలిపారు. కౌన్సిల్ ఆమోదించిన రెండు స్లాబుల విధానం ఈ నెల 22 (నవరాత్రుల మొదటి రోజు) నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు.
సిన్ గూడ్స్ (పాన్ మసాలా, సిగరెట్లు, ఏరేటెడ్ డ్రింక్స్)పై, హైఎండ్ కార్లపై మాత్రం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ ఉండాలని సమావేశంలో ప్రతిపాదించారని తెలిపారు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగతా అన్ని ఉత్పత్తులకు ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయన్నారు. రోజువారీగా వినియోగించే ఆహార, పానీయాలపై ట్యాక్స్ పూర్తిగా ఉండదని, చపాతీ, పరాటాకు ప్రస్తుతం 5 శాతం ట్యాక్స్ ఉండగా, ఇకపై ట్యాక్స్ ఉండదని వెల్లడించారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీఎస్ టీని పూర్తిగా ఎత్తివేసినట్టు ప్రకటించారు.
సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం..
వెన్న, నెయ్యి, డ్రైఫ్రూట్స్, పాలు, సాసేజ్ లు, మాంసం, స్వీట్లు, జామ్, ఫ్రూట్ జెల్లీస్, కొబ్బరి నీరు, నమ్ కీన్, 20 లీటర్ల బాటిల్ తాగునీరు, ఐస్ క్రీమ్, పేస్ట్రీ, బిస్కట్లు, కార్న్ ఫ్లేక్స్ సెరెల్స్ వంటివాటిపై ప్రస్తుతం 18 శాతం ఉండగా, ఇకపై 5 శాతం రేట్ వర్తించనుందని కేంద్ర మంత్రి చెప్పారు. టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిల్స్, టేబుల్ వేర్, కిచెన్ వేర్, గొడుగులు, వంట పాత్రలు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్, దువ్వెనలు 12 శాతం నుంచి 5 శాతానికి.. షాంపూ, టాల్కం పౌడర్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ లు, ఫేస్ పౌడర్, సోప్, హెయిర్ ఆయిల్ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతాయన్నారు.
ఈ సంస్కరణలు సామాన్యుల జీవనాన్ని సులభతరం చేస్తాయని, వ్యాపారాలకు సౌకర్యం కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, రాష్ట్రాలు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేసినా, మొత్తంగా అంగీకారం లభించిందన్నారు. గురువారం (సెప్టెంబర్ 4) మరో సమావేశం జరగనుందని తెలిపారు. సిమెంట్ పై ట్యాక్స్ 28 శాతం నుంచి 18 శాతానికి.. పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వెహికల్స్ పై ట్యాక్స్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
అయితే, 1,200 సీసీ కంటే ఎక్కువుండే పెట్రోల్ కార్లు, 1,500 సీసీ కంటే ఎక్కువుండే డీజిల్ కార్లకు 40 శాతం జీఎస్ టీ వర్తిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ)లకు ప్రస్తుతం ఉన్న 5 శాతం రేట్ వర్తిస్తుంది. సామాన్యుల కోసమే సంస్కరణలు ఈ సంస్కరణలతో సామాన్యులు, రైతులు, మహిళలు, యువతకు లాభం చేకూరుతుంది. అలాగే ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు కృతజ్ఞతలు. ఈరోజు మేమంతా సామాన్యుల కోసం ఏకమయ్యాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం తెలిపాం. ఈ మార్పులతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయి.నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం?
సానుకూల ప్రభావం: బీమా, రోజువారీ అవసరాలు, ఆహారం, ఆటోమొబైల్, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, చేతి వృత్తులు.
ప్రతికూల ప్రభావం: పొగాకు, ఏరేటెడ్ డ్రింక్స్, లగ్జరీ వస్తువుల వంటి 'సిన్ గూడ్స్' రంగాలు.
బీమా రంగం: వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రద్దుతో కవరేజీ పెరిగే అవకాశం.
ఆహారం, రోజువారీ అవసరాలు: నమ్కీన్, భుజియా, పాస్తా, నూడుల్స్, బటర్, ఘీ వంటివి అగ్గువ.
ఆటోమొబైల్: చిన్న కార్లు, బైక్‌లు (350 సీసీ వరకు), బస్సులు, ట్రక్కులు, ఆటో పార్ట్స్ రేట్లు తగ్గుదల.
ఆరోగ్య సంరక్షణ: 33 లైఫ్-సేవింగ్ మందులు జీరో జీఎస్టీకి మార్పు.
నిర్మాణం: సిమెంట్ రేటు 28% నుంచి 18%కు తగ్గుదల.
వ్యవసాయం: ట్రాక్టర్లు, ఇరిగేషన్ ఎక్విప్‌మెంట్ చౌక.
పునరుత్పాదక ఇంధనం: సోలార్, విండ్ డివైస్‌లు 5%కు తగ్గుదల.
సిన్ గూడ్స్: పొగాకు, ఏరేటెడ్ డ్రింక్స్ వంటివాటి ఖరీదు పెరుగుదల.
రేట్లు తగ్గే వస్తువులివే..
జీరో% జీఎస్టీ (మునుపు 5%/12%/18%): యూహెచ్‌టీ పాలు, పనీర్, అన్ని ఇండియన్ బ్రెడ్స్ (రోటీ, పరాఠా), 33 లైఫ్-సేవింగ్ మందులు, వ్యక్తిగత జీవిత/ఆరోగ్య బీమా పాలసీలు.
5%కు తగ్గుదల (మునుపు 12%/18%): హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్, బైసికిల్స్, నమ్కీన్, భుజియా, సాస్‌లు, పాస్తా, ఇన్‌స్టంట్ నూడుల్స్, చాక్లెట్స్, కాఫీ, బటర్, ఘీ, కార్న్‌ఫ్లేక్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, హ్యాండిక్రాఫ్ట్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ (గ్లూకోమీటర్ వంటివి), రెన్యూవబుల్ ఎనర్జీ డివైస్‌లు, హోటల్ రూమ్‌లు (రూ.7,500 వరకు), జిమ్/సెలూన్ సర్వీసెస్.
18%కు తగ్గుదల (మునుపు 28%): సిమెంట్, ఎయిర్ కండిషనర్లు, టీవీలు (32 ఇంచ్‌ల వరకు), డిష్‌వాషర్లు, చిన్న కార్లు, మోటర్‌సైకిల్స్ (350 సీసీ వరకు), థ్రీ-వీలర్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లు, అన్ని ఆటో పార్ట్స్.
రేట్లు పెరిగే వస్తువులు..
'సిన్ గూడ్స్'పై 40% రేటు వర్తిస్తుంది (మునుపు 18%/28%): పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, చూయింగ్ టొబాకో, కెఫినేటెడ్ డ్రింక్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ (పెప్సీ, కోకా-కోలా వంటివి), మోటర్‌సైకిల్స్ (350 సీసీ పైన), హెలికాప్టర్లు, యాచ్ లు. బయోడీజిల్ (ఆయిల్ మార్కెటింగ్ కాకుండా) 12% నుంచి 18%కు పెరుగుదల.
ప్రజల జీవితాలు మెరుగుపడతయ్..
జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న వ్యాపారులు సులభంగా బిజినెస్ చేసుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజలపై భారం తగ్గించేందుకు జీఎస్టీలో సంస్కరణలు తేవాలని మా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్.. ఆ ప్రతిపాదనలను ఆమోదించినందుకు ఆనందంగా ఉంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు, యువత, ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనాలు చేకూరుతాయి.
- ప్రధాని మోదీ