
న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మే నెలలో రూ. 1,02,709 కోట్లకి తగ్గాయి. ఈ వసూళ్లు రూ. లక్ష కోట్లను దాటడం వరసగా ఇది ఎనిమిదో నెల. అయితే, ఏప్రిల్‌లోని రూ. 1.41 లక్షల కోట్లతో పోలిస్తే మే నెల వసూళ్లు బాగా తగ్గినట్లే. ఆ నెలలో దేశంలోని చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు అమలవడమే జీఎస్‌టీ వసూళ్లు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. మే 2020 తో పోలిస్తే జీఎస్‌టీ వసూళ్లు 65 శాతం ఎక్కువయ్యాయి. ఇంపోర్ట్స్‌పై వచ్చే వసూళ్లు మే నెలలో 56 శాతం పెరిగాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్‌టీ రూ. 17,592 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 22,653 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 53,199 కోట్లు, సెస్ రూ. 9,265 కోట్లు ఉన్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న బిజినెస్‌లకు జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్‌కు జులై వరకు గడువుండటంతో అసలైన వసూళ్లు ఇంకా కొంత పెరుగుతాయని మినిస్ట్రీ పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రిటర్న్ఫైలింగ్ గడువును గవర్నమెంట్ పొడిగించింది.