డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 1.50 లక్షల కోట్లు

డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 1.50 లక్షల కోట్లు
  • కిందటి డిసెంబర్​తో పోలిస్తే 15శాతం పెరుగుదల
  •  2021 డిసెంబర్​లో 1.3 లక్షల కోట్లు
  • 1.4 లక్షల కోట్ల మార్కును అందుకోవడం ఇది పదోసారి

న్యూఢిల్లీ: మరోసారి జీఎస్టీ వసూళ్ల వర్షం కురిసింది. పోయిన నెల జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగి రూ. 1.49 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరింత మంది జీఎస్టీ విధానంలోకి రావడం, తయారీ రంగం ఊపందుకొని ఉత్పత్తి, డిమాండ్​ పెరగడం ఇందుకు కారణం. నెలవారీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్ల మార్కును అధిగమించడం వరుసగా ఇది 10వ నెల. నవంబర్‌‌‌‌లో వసూళ్లు దాదాపు రూ.1.46 లక్షల కోట్లు. డిసెంబర్ 2022లో సేకరించిన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,49,507 కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ. 26,711 కోట్లు కాగా, ఎస్​జీఎస్టీ రూ. 33,357 కోట్లు, ఐజీఎస్టీ రూ. 78,434 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 40,263 కోట్లతో కలిపి) ఉన్నాయి. 

మరో రూ.11,005 కోట్ల సెస్​ (వస్తువుల దిగుమతులపై సేకరించిన రూ. 850 కోట్లతో సహా) కూడా ఇందులో భాగమే. డిసెంబరు 2022 లో వచ్చిన ఆదాయం 2021 డిసెంబరు రాబడితో పోలిస్తే 15 శాతం ఎక్కువగా ఉంది. అప్పుడు దాదాపు రూ. 1.30 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.  వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు ఈసారి 8 శాతం ఎక్కువగా ఉన్నాయి.  దేశీయ లావాదేవీల  ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయాల కంటే 18 శాతం ఎక్కువగా ఉన్నాయి. గత నవంబర్​లో 7.9 కోట్ల ఈ-–వే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి.  

2022 అక్టోబర్ లో 7.6 కోట్ల ఈ–-వే బిల్లులు జారీ అయ్యాయి. ఈ విషయమై డెలాయిట్ ఇండియా పార్ట్‌‌నర్ ఎంఎస్​ మణి మాట్లాడుతూ రాష్ట్రాల్లో వినియోగం విపరీతంగా పెరగడం వల్లే ఈ–వేల బిల్లుల సంఖ్య భారీగా ఉందని అన్నారు.  ఎన్​ఏ షా అసోసియేట్స్ పార్టనర్ పరాగ్ మెహతా మాట్లాడుతూ, పన్ను అధికారులు  జీఎస్టీఎన్​ ప్లాట్‌‌ఫారమ్ సహాయంతో  ఎగవేతదారులను  గుర్తించగలిగారని అన్నారు. 

ఈ కారణంగా గత 3-–4 నెలల్లో ఎక్కువ కలెక్షన్లు ఉంటున్నాయని వివరించారు. 2022 ఏప్రిల్‌‌లో జీఎస్టీ ద్వారా రికార్డుస్థాయిలో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. మేలో దాదాపు రూ.1.41 లక్షల కోట్లు, జూన్​లో రూ. 1.45 లక్షల కోట్లు, జులైలో  రూ. 1.49 లక్షల కోట్లు, ఆగస్టులో రూ. 1.44 లక్షల కోట్లు, సెప్టెంబర్​లో రూ. 1.48 లక్షల కోట్లు, అక్టోబర్​లో రూ. 1.52 లక్షల కోట్లు, నవంబర్​లో రూ. 1.46 లక్షల కోట్లు వసూలయ్యాయి. 

జీడీపీలో 3 శాతానికి చేరిన కార్పొరేట్ పన్ను వసూళ్లు

కార్పొరేట్ పన్ను వసూళ్లతో కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోంది.  రెండేళ్ల విరామం తర్వాత కార్పొరేట్ పన్ను వసూళ్లు 2021–22లో  జీడీపీలో 3 శాతం వరకు పెరిగాయి. వస్తువులకు,  సేవలకు డిమాండ్ పెరగడం, ఇండియా కంపెనీల లాభదాయకత మరింత బాగుండటమే ఇందుకు కారణం. అయితే, కార్పొరేట్ పన్ను వసూళ్లు 2018-–19 లో జీడీపీలో 3.51 శాతాన్ని చేరాయి. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. 

2021–-22లో నికర కార్పొరేట్ పన్ను వసూళ్ల విలువ రూ.7.12 లక్షల కోట్లు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం జీడీపీ రూ.236.64 లక్షల కోట్లు.  2018–19లో ఈ నిష్పత్తి అత్యధికంగా ఉంది. ఈ సంవత్సరంలో  కార్పొరేట్ పన్ను వసూళ్ల నికర విలువ రూ.6.63 లక్షల కోట్లు. అంటే జీడీపీలో 3.51 శాతం. కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు కారణంగా 2019-–20 లో  జీడీపీలో వీటి వాటా 2.77 శాతానికి పడిపోయింది. 

పన్నులను ఇంతలా తగ్గించడం 28 ఏళ్లలో అదే మొదటిసారి. కొత్త తయారీ యూనిట్లను ప్రోత్సహించడానికి కార్పొరేట్ పన్ను రేట్లను దాదాపు 10 శాతం పాయింట్ల మేర ప్రభుత్వం తగ్గించింది. కొత్త రూల్స్​ ప్రకారం 2019 అక్టోబర్​లో లేదా ఆ తర్వాత ఏదైనా కొత్త దేశీయ కంపెనీ తయారీ రంగంలో పెట్టుబడులు పెడితే 15 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి.  దేశీయ కంపెనీలు మినహాయింపులను వదులుకుంటే  22 శాతం రేటుతో పన్నులు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.  మ్యాట్ రేటును కూడా 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. దీంతో 2019–-20 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు రూ. 5.56 లక్షల కోట్లకు పడిపోయాయి.