జీఎస్​టీ వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లు

జీఎస్​టీ వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్​టీ జులై వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లకు పెరిగాయి. వసూళ్లు వరసగా రెండో నెలలోనూ రూ. 1.60 లక్షల కోట్లను దాటడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జూన్​ నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ. 1.61 లక్షల కోట్లయితే, మే 2023 జీఎస్​టీ వసూళ్లు రూ. 1.57 లక్షల కోట్లు. అంతకు ముందు ఏడాది అంటే 2022 జులై నెలతో పోలిస్తే జీఎస్​టీ వసూళ్లు 11 శాతం పెరిగినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది.2022 జులై నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ. 1.49 లక్షల కోట్లే.  జీఎస్​టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే రూ. 1.60 లక్షల కోట్లకు మించి వసూలవడం ఇది ఆరోసారని పేర్కొంది. పన్ను ఎగవేతదారులపై తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంతోపాటు, కన్జూమర్లు తమ ఖర్చులను పెంచడం వల్లే జులై నెలలో జీఎస్​టీ వసూళ్లు పెరిగాయని ఫైనాన్స్​ మినిస్ట్రీ చెబుతోంది.
జులై నెలలో సీజీఎస్​టీ రూ. 29,773 కోట్లు, ఎస్​జీఎస్​టీ రూ. 37,623 కోట్లు, ఐజీఎస్​టీ రూ. 85,930 కోట్లు, సెస్​ రూ. 11,779 కోట్లు వసూలైనట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. 

 జీఎస్​టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్​లో రూ. 1.87 లక్షల కోట్లకు ఎగసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దిగుమతులు సహా దేశీయ ట్రాన్సాక్షన్లపై జీఎస్​టీ వసూళ్లు అంతకు ముందు ఏడాదిలోని జులై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై లో  15 శాతం పెరిగినట్లు డేటా వివరించింది. ఇండ్లు, కార్లు, వెకేషన్స్​, ఇతర కన్జూమర్​ ఐటమ్స్​పై ఖర్చు పెరగడం వల్ల జీఎస్​టీ కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయని ఎన్​ఏ షా అసోసియేట్స్​పార్ట్​నర్​ పరాగ్​ మెహతా చెప్పారు. జీఎస్​టీఎన్​ నెట్​వర్క్​ పటిష్టంగా ఉండటం వల్ల పన్ను ఎగవేతదారులను తొలిదశలోనే కనుగొనే వీలు కలిగిందని, ఫేక్​ ఇన్వాయిసింగ్​కు పాల్పడుతున్న వారిపై వెంటనే జీఎస్​టీ అధికారులు చర్యలు తీసుకోగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ పరిశ్రమలకు జీఎస్​టీ పై ఉండే సందేహాలను జీఎస్​టీ కౌన్సిల్​ ఎప్పటికప్పుడు తీరుస్తుండటం కూడా మంచి పరిణామమని, దీంతో చట్టంపై క్లారిటీ పెరిగి తద్వారా వసూళ్లు అధికమవుతున్నాయని వివరించారు. ఈ–ఇన్వాయిసింగ్​ లిమిట్స్​ను తగ్గించుకుంటూ రావడం కూడా మంచి ఫలితాలను ఇస్తోందని డెలాయిట్​ ఇండియా పార్ట్​నర్​ ఎం ఎస్​ మణి చెప్పారు. రాష్ట్రాలవారీగా జీఎస్​టీ ఆడిట్ల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కూడా సత్ఫలితాలు తెస్తోందని పేర్కొన్నారు. 

ఆరు రాష్ట్రాల నుంచే 60 శాతం వసూళ్లు....

దేశంలోని ఆరు కీలక రాష్ట్రాల నుంచే జీఎస్​టీ వసూళ్లలో 60 శాతం సమకూరుతున్నాయి. జులై నెలలోనూ ఇదే ట్రెండ్​ కంటిన్యూ అయింది. దేశంలోని బిజినెస్​లకు జీఎస్​టీ పై అవగాహన బాగా పెరిగిందని,  నెలవారీ వసూళ్లు నిలకడగా రూ. 1.60 లక్షల కోట్లను దాటుతుండటమే దీనికి నిదర్శనమని మణి పేర్కొన్నారు. రాబోయే ఫెస్టివల్​ సీజన్​లో జీఎస్​టీ వసూళ్లు మరింత పెరుగుతాయని కేపీఎంజీ ఇండియా నేషనల్​ హెడ్​ అభిషేక్​ జైన్​ చెప్పారు.