
- కిందటేడాది మేతో పోలిస్తే 12 శాతం వృద్ధి
- వరుసగా 14 వ నెలలోనూ రూ.1.4 లక్షల కోట్ల పైనే..
బిజినెస్ డెస్క్, వెలుగు: జీఎస్‌టీ కలెక్షన్స్ కిందటి నెలలో రూ.1,57,090 కోట్లకు పెరిగాయి. కిందటేడాది మే నెలలో వచ్చిన రూ 1,40,885 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించాయి. కానీ, నెల వారీ ప్రాతిపదికన తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ లెవెల్‌లో రూ.1,87,035 కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెల వారీ జీఎస్‌టీ కలెక్షన్స్ రూ.1.4 లక్షల కోట్లను దాటడం వరుసగా ఇది 14 వ సారి. రూ.1.5 లక్షల కోట్లను దాటడం ఇది ఐదోసారి. మే నెల జీఎస్‌టీ వసూళ్లలో రూ.28,411 కోట్లు సెంట్రల్ జీఎస్‌టీ నుంచి రాగా, రూ.35,828 కోట్లు స్టేట్ జీఎస్‌టీ కింద వచ్చాయి.
ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ కింద రూ.81,363 కోట్ల రెవెన్యూ వచ్చింది. గూడ్స్ దిగుమతులపై వేసిన జీఎస్‌టీ రూ.41,772 కోట్లు ఇందులో కలిసి ఉన్నాయి. సెస్ కింద మే నెలలో రూ.11,489 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇందులో దిగుమతుల నుంచి వచ్చిన రూ. 1,057 కోట్లు కలిసి ఉన్నాయి. ఐజీఎస్‌టీ ద్వారా వచ్చిన రెవెన్యూలో రూ.35,369 కోట్లు సీజీఎస్‌టీ కింద, రూ.29,769 కోట్లు ఎస్‌జీఎస్‌టీ కింద ప్రభుత్వం సెటిల్ చేసింది. సెటిల్‌మెంట్స్ పూర్తయ్యాక మే లో సీజీఎస్‌టీ కింద రూ.63,780 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.65,597 కోట్లు వచ్చాయి.
తెలంగాణలో రూ.4,507 కోట్లు
రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో జీఎస్‌టీ కింద రూ. 4,507 కోట్లు వసూళ్లయ్యాయి. కిందటేడాది మే నెలలో వచ్చిన రూ.3,982 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.3,047 కోట్ల నుంచి రూ.3,373 కోట్లకు పెరిగాయి. ఇది 11 శాతం గ్రోత్‌కు సమానం.