- అక్టోబర్‌లో 10 శాతం వృద్ధితో రూ. 5,726 కోట్లు వసూలు
- జీఎస్టీ శ్లాబుల తగ్గింపు.. దసరా, దీపావళి ఆఫర్లతో పెరిగిన సేల్స్
- తగ్గించిన శ్లాబులతో రాష్ట్రానికి వస్తున్న నష్టంపై ఈ నెల సేల్స్‌తోనే క్లారిటీ
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో10 శాతం వృద్ధి సాధించిన రాష్ట్రంగా కర్నాటకతో పాటు సమానంగా నిలిచింది. దసరా, దీపావళి పండుగల సీజన్ అమ్మకాలతో రికార్డు స్థాయిలో రూ.5,726 కోట్ల జీఎస్టీ వసూళ్లను రాష్ట్రం సాధించింది. జీఎస్టీ శ్లాబులు తగ్గించడంతో రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందోనని లెక్కలు వేస్తున్న తరుణంలో.. పెరిగిన సేల్స్ ఒక నెల ఉపశమనాన్ని కలిగించాయి.
గతేడాది అక్టోబర్ తో పోల్చితే తెలంగాణలో దాదాపు రూ. 515 కోట్లు పెరిగినట్లు కేంద్రం వెల్లడించిన లెక్కల్లో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ లో రూ. 5, 211 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా రూ. 1, 45,052 కోట్ల జీఎస్టీ రెవెన్యూ కలెక్షన్ జరిగినట్లు తెలిపింది.
అయితే జాతీయ స్థాయిలో కేవలం 2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయగలిగింది. కాగా, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ)లో స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(ఎస్ జీఎస్టీ) కింద గత నెల వరకు తెలంగాణ వాటా కింద రూ. 26, 334 కోట్లు సెటిల్ చేసినట్లు కేంద్ర వెల్లడించింది. గతేడాది ఈ సమయంతో పోల్చితే ఈ వాటాలో 4 శాతం గ్రోత్ ఉన్నట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్ లో రూ. 25, 306 కోట్లను చెల్లించినట్లు పేర్కొంది.
నవంబర్ లెక్కలతోనే పూర్తి క్లారిటీ
జీఎస్టీ వసూళ్లకు ఇప్పుడు నవంబర్ నెల లెక్కలు సవాలుగా మారనున్నాయి. జీఎస్టీ శ్లాబుల రేట్ల తగ్గింపు ప్రభావం రాష్ట్ర ఆదాయంపై ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవాలంటే నవంబర్ సేల్స్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పండుగలకు ముందు జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వస్తువుల ధరలు తగ్గాయి.
దీనికి తోడు దసరా, దీపావళి ఆఫర్లు ఉండటంతో ప్రజలు కొనుగోళ్లు పెంచారు. ఫలితంగా, రాష్ట్రంలో అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం పెరిగింది. ఈ పెరుగుదలలో పండుగ డిమాండ్ వాటానే అధికంగా ఉందని, తగ్గించిన రేట్ల వల్ల వచ్చిన నష్టం పెరిగిన కొనుగోళ్ల పరిమాణంతో పూడుకుపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, పండుగ హడావుడి తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలలో కొనుగోళ్ల వేగం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు, తగ్గిన పన్ను రేట్ల వల్ల వచ్చే ఆదాయం ఎంత? అమ్మకాల పెరుగుదల వల్ల వచ్చే ఆదాయం ఎంత? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన వస్తుందని చెబుతున్నారు. అందుకే, నవంబర్ జీఎస్టీ కలెక్షన్లను 'లిట్మస్ టెస్ట్'గా ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
సర్కారు ఆదాయంపై కొంత ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 12 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేసి, అత్యధిక వస్తువులను 5 శాతం, 18 శాతం శ్లాబుల్లోకి మార్చింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, 90% వస్తువులపై పన్ను భారం తగ్గింది. దీనివల్ల ధరలు తగ్గి, సామాన్యులకు ఉపశమనం లభించినా, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేశారు.
అయితే, ఈ పండుగ సీజన్‌లో భారీగా పెరిగిన కొనుగోళ్ల కారణంగా, తగ్గిన పన్ను రేటు ప్రభావం కూడా ఆదాయంపై పెద్దగా పడలేదని స్పష్టమైంది. దసరా, దీపావళి సందర్భంగా పెరిగిన గృహోపకరణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాల అమ్మకాలతో పాటు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతోరాష్ట్రానికి ఈస్థాయిలోఆదాయం వచ్చిందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ తగ్గింపు ఎంత మేరకు ఆదాయంలో తగ్గుదల చూపిస్తుందనేది నవంబర్ డేటాలోనే తెలుస్తుంది. ఈ నెలలో కూడా జీఎస్టీ ఆదాయం స్థిరంగా, కనీసం రూ.5,200 కోట్ల మార్క్‌కు అటుఇటుగా ఉంటే, శ్లాబుల మార్పు పెద్ద ప్రభావం చూపలేదని, రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు బాగానే ఉన్నాయని భావించవచ్చు. ఒకవేళ వసూళ్లు అంతకంటే తక్కువగా, ముఖ్యంగా సెప్టెంబర్ నెలలోని రూ. 4,998 కోట్ల స్థాయికి పడిపోతే, తగ్గిన పన్ను రేట్ల ప్రభావం తీవ్రంగా ఉందని స్పష్టమవుతుంది.
వెనుకంజలో బీజేపీ పాలిత రాష్ట్రాలు
జీఎస్టీ వసూళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనకంజలో ఉన్నాయి.యూపీ (2శాతం), మహారాష్ట్ర (3 శాతం), గుజరాత్ (6 శాతం), హర్యానా (0శాతం), ఒడిశా (5 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా.. పంజాబ్, తమిళనాడు 4 శాతం చొప్పున వృద్ధి కనబరిచాయి. కాగా, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఏపీ మైనస్ 9 వృద్ధి నమోదు చేసింది.
అలాగే హిమాచల్ ప్రదేశ్ మైనస్ 17, జార్ఖండ్ మైనస్. 15, మధ్యప్రదేశ్ మైనస్ 5, రాజస్థాన్ మైనస్ 3, చత్తీస్ గఢ్ మైనస్ 2, కేరళ మైనస్ 2, వెస్ట్ బెంగాల్ మైనస్ 1, ఢిల్లీ మైనస్ 1 గ్రోత్ తో ఆశించిన మేర జీఎస్టీ కలెక్షన్లు సాధించలేకపోయాయి. యూటీలు/ఈశాన్య రాష్ట్రాలు మాత్రం 30 శాతానికిపైగా వృద్ధి కనబరిచినట్లు కేంద్రం వెల్లడించింది.
