జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నయ్

జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నయ్
  • రాష్ట్రానికి 4 నెలల్లో రూ.17,385 కోట్లు
  • జులైలో రూ. 4,547 కోట్లు.. గత జులై కంటే 26% ఎక్కువ 

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రెండో అత్యధిక వసూళ్లు సాధించిన నెలగా ఈ ఏడాది జులై నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం రూ.1,48,955 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో సాధించిన రూ.1.68 లక్షల కోట్లే జీఎస్టీ వసూళ్లలో ఇప్పటి వరకు ఆల్ టైం హైగా ఉంది. కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం సీజీఎస్టీ ద్వారా రూ.25,751 కోట్లు, ఎస్‌‌జీఎస్టీ ద్వారా రూ.32.807 కోట్లు వచ్చింది. ఐజీఎస్టీ కింద రూ.79,518 కోట్లు, సెస్సుల రూపంలో మరో రూ.10,920 కోట్లు సమకూరింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. జులైలో రూ.4,547 కోట్ల రాబడి వచ్చింది. కిందటేడుతో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నిరుడు జులైలో జీఎస్టీ రూ.3,610 కోట్లు రాగా ఈ సారి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చాయి. గత నాలుగు నెలల్లో రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా మొత్తం రూ.17,385 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ నుంచే ఆశించిన మేర జీఎస్టీ వసూలైతున్నది. అసలే అప్పులు పుట్టక.. ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం కలిసొస్తున్నది. ఏప్రిల్​లో అత్యధికంగా రూ.4,955 కోట్లు వచ్చాయి. ఆ తరువాత రెండు నెలలు కొంత తగ్గింది. మే నెలలో రూ.3,982 కోట్లు రాగా.. జూన్​లో రూ.3,901 కోట్లు వచ్చాయి. ఏపీలో సైతం ఈ నెల జీఎస్టీ వసూళ్లు 25 శాతం అధికంగా వచ్చాయి. కిందటేడు జులైలో రూ.2,730 కోట్లు జీఎస్టీ రూపంలో వసూల కాగా.. ఈ సారి జులైలో రూ.3,409 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది.

ప్రతినెల సగటు పెరుగుతోంది
ప్రతి నెలా జీఎస్టీ సగటు పెరుగుతూ వస్తోంది. 2017లో  రాష్ట్రంలో నెల సగటు జీఎస్టీ రూ.3505 కోట్లుగా ఉంది. ఆ తరువాత నుంచి ఇది ప్రతి ఏడాది దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర పెరుగుతూ వస్తోంది. ఇక ప్రతి ఏడాది జీఎస్టీ తో వస్తున్న రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతోంది. జులై నెల వసూళ్లలో మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, కర్నాటక తరువాత తెలంగాణనే ఉన్నది. జీఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. తనకు వస్తున్న మొత్తాన్ని చెప్పుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి రాక ముందు అన్ని రకాలుగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2015-–16లో రూ.2593 కోట్లు, 2016–17లో రూ.2936 కోట్లు మాత్రమే ఉంది.