
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. మార్చి నెలకు చెందిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇవి రూ.28,309 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఇవి రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ అనేది కన్జంప్షన్ ఆధారిత పన్ను. ఎకానమీ స్లోడౌన్ అయిందని చెప్పడానికి ఎకనామిస్ట్ లు దీన్నే ప్రధాన ఇండికేటర్‌గా తీసుకుంటారు. అయితే మార్చి నెల 24 వరకు వ్యాపార కార్యకలాపాలన్ని సాధారణంగానే జరిగాయి. ఆ తర్వాత నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు కూడా కరోనా ఎఫెక్ట్ తో వ్యాపారాలు కాస్త సన్నగిల్లిన సంగతి తెలిసిందే. ఈ లెక్కలను చూస్తే ఎకానమీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ప్రభుత్వాధికారులు అంటున్నారు.
జీఎస్టీ లెక్కల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూలు కూడా భారీగా తగ్గినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) వసూళ్లు రికార్డు కనిష్ట స్థాయిల్లో రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నాయి. మార్చి నెల కలెక్షన్లకు జీఎస్టీ పేమెంట్లు జరిపే తుది గడువు ఏప్రిల్ 20గా ఉంటుంది. కరోనా కారణంతో ప్రభుత్వం 15 రోజులు ఇంటరస్ట్ ఫ్రీ గ్రేస్ పిరియడ్ ఇచ్చి, దీన్ని ఈ నెల 5 వరకు పొడిగించింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు గ్రేస్ పిరియడ్ పొడిగింపును ఎంపిక చేసుకున్నారు. అదే ఈ నెల 5 తర్వాత, జూన్ 30 వరకు రిటర్నులు దాఖలు చేసే వారు 9 శాతం వడ్డీని చెల్లించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో కలెక్షన్లలో పెరుగుదల ఉంటుందా? అనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం కష్టంగా మారింది. కలెక్షన్లు తగ్గుదల, వాటికి దారితీసిన పరిణామాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన బ్యూరోక్రాట్స్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఎకనమిస్ట్ లు కూడా ఈ జీఎస్టీ లెక్కలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇవి వార్నింగ్ బెల్స్ అని హెచ్చరించారు.
మే నెల జీఎస్టీ లెక్కలోనూ ఇదే పరిస్థితి…
అయితే జీఎస్టీ కలెక్షన్స్ భారీగా తగ్గిపోవడం సాధారణమేనని, ట్రాన్స్‌పోర్టేషన్ లేకపోవడం, కేవలం అత్యవసర వస్తువులు మాత్రమే అమ్మకానికి ఉండటంతో వసూళ్లు తగ్గినట్టు ఒక సీనియర్ అనలిస్ట్ చెప్పారు. అదేవిధంగా చాలా వ్యాపారాలు జీఎస్టీ పేమెంట్లను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ‘మార్చి నెల చివరి 10 రోజుల నుంచి దేశమంతా పూర్తి లాక్‌డౌన్‌లోకి వచ్చేసింది. అన్ని వ్యాపారాలు కూడా జీఎస్టీ పేమెంట్లను వాయిదా వేశాయి. దీంతో అనుకున్న స్థాయిలోనే జీఎస్టీ కలెక్షన్లు తగ్గిపోయాయి. ఏప్రిల్ నెల కూడా పూర్తిగా లాక్‌డౌన్‌లోనే ఉంది. లిక్విడిటీ కొరత ఏర్పడింది. ఏప్రిల్‌కు చెందిన కలెక్షన్లు కూడా మే నెల జీఎస్టీ లెక్కల్లో తగ్గిపోనున్నాయి.