జీఎస్టీ వసూళ్లు రూ.1.52 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు రూ.1.52 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డుస్థాయిలో వసూలు అయ్యాయి. పోయిన నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,51,718 కోట్లు ఉంది.  2021 అక్టోబరు వసూళ్లతో పోలిస్తే ఇది 16 శాతం పెరిగింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక  2022 ఏప్రిల్లో మొదటిసారిగా స్థూల జీఎస్టీ  రాబడి రూ. 1.50 లక్షల కోట్ల మార్క్​ను తాకింది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ విలువ రూ.26,039 కోట్లు, ఎస్‌‌జీఎస్టీ రూ.33,396 కోట్లు, ఐజీఎస్టీ రూ.81,778 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.37,297 కోట్లతో కలిపి),  సెస్ రూ.10,505 కోట్లు ఉందని (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 825 కోట్లతో సహా) కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  వరుసగా తొమ్మిదవ నెలలోనూ జీఎస్టీ ఆదాయాలు రూ. 1.40 లక్షల కోట్ల మార్కు కంటే ఎక్కువగా ఉన్నాయి.  2022 సెప్టెంబర్ నెలలో  8.3 కోట్ల ఈ–-వే బిల్లులు జారీ కాగా, 2022 ఆగస్టు లో వీటి సంఖ్య7.7 కోట్లు ఉంది.

పీఎంఐ పెరిగింది

ఎస్​అండ్​పీ మంగళవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ పుంజుకుంటోంది. పోయిన నెలలో తయారీరంగంలో ఉత్పత్తి నెమ్మదిగా ఉన్నా, ఆర్డర్లు బలమైన వేగంతో పెరగడంతో   కార్యకలాపాలు పటిష్టంగా మారాయి. ధరలు అదుపులోకి వచ్చాయి.  కాలానుగుణంగా సర్దుబాటు చేసి రూపొందించే ఎస్​&పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫా క్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సెప్టెంబర్‌‌లో 55.1 ఉండగా, అక్టోబర్‌‌లో 55.3కి పెరిగింది. ఉద్యోగాల పెరుగుదల గత మూడేళ్ల గరిష్టస్థాయికి చేరిందని ఎస్​ అండ్​ పీ తెలిపింది. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా ఇండియా పరిస్థితి బాగుందని పేర్కొంది.  మానుఫ్యాక్చరింగ్​ పీఎంఐ డేటా ఇక నుంచి కూడా బలంగా కొనసాగుతూనే ఉండొచ్చని రీసెర్చ్​ ఫర్మ్​ బార్​క్లేస్​ తెలిపింది. ఆర్డర్లు, ఉత్పత్తి,  ఉద్యోగాల సృష్టిలో ఎటువంటి ఇబ్బందులూ కనిపించడం లేదని సంస్థ ఆసియా ఎకనామిక్స్ విభాగం   ఎండీ & హెడ్ రాహుల్ బజోరియా అన్నారు. ఉత్పత్తి కార్యకలాపాలకు ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్ అనుకూలంగా ఉందని, అయితే పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కాస్త నెమ్మదించిన ఆర్థిక పరిస్థితులు కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని అన్నారు. అత్యవసరం కాని వస్తువులకు  డిమాండ్ తగ్గిపోవచ్చని అన్నారు.  పండుగ సీజన్ వినియోగాన్ని పెంచడం, దేశీయ డిమాండ్ పుంజుకోవడంతో రాబోయే రెండేళ్లలో దేశం కనీసం 6శాతం వృద్ధిని సాధించవచ్చని రాహుల్​ వివరించారు. ఇక నుంచీ భారత ఎకానమీ మరింత బాగుంటుందన్నారు.