డిసెంబర్‌‌‌‌లో జీఎస్టీ వసూళ్లు.. రూ. 1.64 లక్షల కోట్లు

డిసెంబర్‌‌‌‌లో జీఎస్టీ వసూళ్లు.. రూ. 1.64 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబరులో 10 శాతం పెరిగి దాదాపు రూ. 1.64 లక్షల కోట్లకు చేరాయి. 2022 డిసెంబరులో వసూళ్ల విలువ రూ. 1.49 లక్షల కోట్లుగా రికార్డయింది. గత ఏడాది ఏప్రిల్–-డిసెంబర్  స్థూల జీఎస్టీ వసూళ్లు 12 శాతం వృద్ధిని సాధించి రూ. 14.97 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 13.40 లక్షల కోట్లు వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో సగటు నెలవారీ స్థూల జీఎస్‌‌‌‌టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో  నమోదైన రూ. 1.49 లక్షల కోట్ల సగటుతో పోలిస్తే ఈ ఏడాది 12 శాతం వృద్ధిని సూచిస్తోంది.  డిసెంబర్, 2023 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,64,882 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ రూ. 30,443 కోట్లు, ఎస్​జీఎస్టీ రూ. 37,935 కోట్లు, ఐజీఎస్టీ రూ. 84,255 కోట్లు (దిగుమతిపై సేకరించిన రూ. 41,534 కోట్లతో కలిపి)  సెస్ రూ. 12,249 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 1,079 కోట్లతో సహా) ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు నెలలపాటు జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి.