పరిహారం ఇవ్వాల్సిందే .. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్రాన్ని కోరనున్న ప్రతిపక్ష పార్టీలు

పరిహారం ఇవ్వాల్సిందే .. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్రాన్ని కోరనున్న ప్రతిపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు మంగళవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్​ సమావేశంలో కేంద్రాన్ని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీఎస్టీ విధానంలో హామీ ఇచ్చిన దానికంటే తక్కువ ఆదాయ వృద్ధి కారణంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పరిహారాన్ని ఇక నుంచి కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నాయి.  ఎజెండాలో లేకపోయినా కేరళ,  ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ వంటి కొన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు చర్చల సమయంలో ఈ సమస్యను లేవనెత్తుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రాష్ట్రాలకు జీఎస్టీ నుంచి ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. 2017లో కేంద్రం జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

లగ్జరీ వస్తువులపై సెస్ విధించడం ద్వారా ఐదేళ్లపాటు రాష్ట్రాలకు 14శాతం ఆదాయ వృద్ధిని కల్పిస్తామని హామీ ఇచ్చింది.  2022 జూన్​లోనే పరిహారం ఆగిపోయినప్పటికీ, రెవెన్యూ లోటు కారణంగా  సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చి 2026 వరకు పొడిగించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. కరోనా సమయంలో తగ్గిన రాబడి వసూళ్లను పరిష్కరించడానికి, కేంద్రం 2020–-21,  2021–-22లో  రూ.2.69 లక్షల కోట్లను అప్పుగా తీసుకుంది. రాష్ట్రాల జీఎస్టీ సేకరణ లోటును పూడ్చడానికి నిధులను కేటాయించింది. 2026 తరువాత కూడా సెస్​ను కొనసాగించాలనే విషయమై ఈ సందర్భంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆన్​లైన్​ గేమింగ్​పై జీఎస్టీ, నాన్​ ఫ్రైడ్​ స్నాక్స్​పై పన్ను తగ్గింపు, ఎంయూవీలు, కేన్సర్​ డ్రగ్స్​పై జీఎస్టీ వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలిజీఎస్టీ రేట్లలో ఏవైనా మార్పులను తీసుకురావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని క్రమంగా అమలు చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ ​వివేక్ జోహ్రీ అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబడి సామర్థ్యం మెరుగుపడినందున, రేట్లలో మార్పుచేర్పులకు  ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నారు. అయినప్పటికీ, అన్ని మార్పులను ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని వివేక్​ చెప్పారు. ఆదాయం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మార్పులు చేయాలని వివరించారు. కొన్ని రేట్లను కలిపి ఒకేరేటుగా చేసేందుకు అవకాశాలు ఉండొచ్చని అన్నారు.