
జీఎస్‌టీ తగ్గించి ఆదుకోవాలని ఆర్థిక మంత్రికి వేడుకోలు
న్యూఢిల్లీ : మునుపెన్నడూ లేని విధంగా అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో జీఎస్‌టీ తగ్గింపుతోపాటు, పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆటో పరిశ్రమ కోరింది. బుధవారం నాడు ఆటో పరిశ్రమ ప్రముఖులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సీ భార్గవ, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టర్) రాజన్ వధేరాలతోపాటు ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు ఆటోమొబైల్ రంగంలో హుళక్కయిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో రంగానికి చేయూతనిచ్చేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరాం. వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, చొరవ తీసుకుంటుందనే నమ్మకం ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియాం) ప్రెసిడెంట్ రాజన్ వధేరా ఆర్థిక మంత్రితో మీటింగ్ అనంతరం వెల్లడించారు.
అమ్మకాలు ఎందుకు తగ్గాయో కారణాలు తెలుసుకోవాలని ప్రభుత్వం కోరుకుందని, ఆ నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగిందని వివరించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్ పరిశ్రమ కష్టాలను అర్ధం చేసుకుని, సానుకూలత కనబరిచిందని వెల్లడించారు. నిధుల లభ్యత, తక్కువ వడ్డీకి నిధులు దొరక్కపోవడం, కమర్షియల్ వెహికిల్స్‌కు యాక్సిల్ లోడ్ కెపాసిటీ నిబంధనల మార్పు వంటివి ఆటో పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని ఆర్థిక మంత్రికి వివరించామన్నారు. వెహికిల్స్ రిజిస్ట్రేషన్ ఫీజును పెంచే ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని, దానిని అమలులోకి తీసుకురావద్దని కోరినట్లు కూడా వధేరా తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గేలా వెంటనే చర్యలు ఆవశ్యకమని కోరామని చెప్పారు.
ఆర్థికంగా సరైన నిబంధనలు పాటిస్తున్న ఆటో రంగ కంపెనీలకు అప్పులు ఆపేయొద్దని బ్యాంకులను ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. అతి తక్కువ ఎన్‌పీఏ ఉన్న విభాగాలకు అప్పులు ఆపేయద్దని అడిగామని చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్ చేసేందుకు తగిన ఇన్సెంటివ్స్‌తో పాలసీ తీసుకురావాలని కోరామని, దాని వల్ల కొత్త వెహికిల్స్ అమ్మకాలు ఊపందుకుంటాయని వధేరా వెల్లడించారు. వెహికిల్స్ డిమాండ్ పెరగాలంటే, జీఎస్‌టీని ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని కోరినట్లు తెలిపారు.