
- డబ్బు లావాదేవీలు జరిపే ..కంపెనీలే టార్గెట్
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేసినట్లు అనుమానిస్తున్న 100 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై జీఎస్టీ అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్స్‌లో 100 కి పైగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు రిజిస్టరయ్యాయి. ఈ కంపెనీల యాక్టివిటీస్‌పై ఫోకస్ పెడుతున్నామని, జీఎస్టీ ఎగవేత ఏ మేరకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. గేమింగ్ యాక్టివిటీస్‌లో డబ్బు లావాదేవీలు సాగించే ఆన్లైన్ గేమింగ్కంపెనీలపైనే నజర్ పెడుతున్నట్లు చెప్పారు. ఈ వంద కంపెనీలలో అన్ని కంపెనీలూ రియల్మనీ ట్రాన్సాక్షన్లలో పాల్గొనడం లేదని, అలాంటి కంపెనీలను పట్టించుకోమని పేర్కొన్నారు. కిందటేడాది సెప్టెంబర్‌లో గేమ్స్క్రాఫ్ట్ అనే ఆన్లైన్ గేమింగ్ కంపెనీకి రూ. 21 వేల కోట్ల జీఎస్టీ చెల్లించమంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆ కంపెనీ హైకోర్టులో సవాలు చేసుకుంది.
ఆ తర్వాత హైకోర్టు కంపెనీకి అనుకూలంగా స్టే ఇచ్చింది. ఈ స్టేను పట్టించుకోకుండా అధికారులు అదే రోజున 28 శాతం చొప్పున జీఎస్టీ చెల్లించాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చినట్లు చెబుతూ, రెండోసారి హైకోర్టు బెంచ్‌ను కంపెనీ ఆశ్రయించింది. కానీ, ఆ తర్వాత సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం కోరినట్లుగా సమాధానం ఇవ్వమంటూ గేమ్స్క్రాఫ్ట్ కంపెనీని సుప్రీం కోర్టు ఆదేశించింది.