
- కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లింపు
- బ్యాంక్‌ల నుంచి భారీగా అప్పులు
- అకౌంట్లను ఎన్‌పీఏలుగా మారుస్తున్నారు
న్యూఢిల్లీ: ఫేక్ ఇన్వాయిస్‌ల కేసులో 25 మందిని డీజీజీఐ కిందటి వారం అరెస్టు చేసింది. వేస్ట్, నాన్–ఫెర్రస్ మెటల్ స్క్రాప్, రెడీమేడ్ గార్మెంట్స్, గోల్డ్, సిల్వర్, కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్‌ల పేరిట ఫేక్ ఇన్వాయిస్‌లు జారీ చేసినందుకు వారిని అదుపులోకి తీసుకుంది. 1,180 సంస్థల పేరిట ఫేక్ ఇన్వాయిస్‌లు జారీ చేసినందుకు మొత్తం 350 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) నమోదు చేసింది. ఈ రాకెట్‌లో భాగం ఉన్న ఇతరులనూ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఫేక్ ఇన్వాయిస్‌లను వాడుకున్న బెనిఫిషియరీల అరెస్టుకూ చర్యలు తీసుకుంటున్నారు. జీఎస్‌టీ, ఇన్‌కంట్యాక్స్ ఎగవేతలకు, మనీ లాండరింగ్‌కూ ఈ ఫేక్ ఇన్వాయిస్‌లను బెనిఫిషియరీలు వాడుకున్నారు. ఎంఎస్, ఎస్‌ఎస్ స్క్రాప్, ఐరన్ అండ్ స్టీల్ వస్తువులు, కాపర్ రాడ్–వైర్, నాన్ ఫెర్రస్ మెటల్స్ స్క్రాప్, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్, పీవీసీ రెసిన్, రెడీమేడ్ గార్మెంట్స్, గోల్డ్, సిల్వర్, కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్, ఆగ్రో ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, మొబైల్, మాన్ పవర్ సప్లై సర్వీసెస్, అడ్వర్టయిజ్‌మెంట్ అండ్ యానిమేషన్ సర్వీసెస్‌ల పేరుతో ఫేక్ ఇన్వాయిస్‌లు జారీ అయినట్లు డీజీజీఐ గుర్తించింది.
అన్ని సిటీలలో దర్యాప్తులు….
గత నెలలో జరిగిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో హైలెవెల్ మీటింగ్ తర్వాత దర్యాప్తు వేగం పెంచారు. జీఎస్‌టీ ఇన్‌వాయిస్ ఫ్రాడ్స్ కనిపెట్టేందుకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లూధియానా, చెన్నై, నాగ్‌పూర్, కోల్‌కత్తా, గురుగ్రామ్, అహ్మదాబాద్, సూరత్, వదోదరా, భిలాయ్, జోధ్‌పూర్, హైదరాబాద్, మథుర, రాయ్‌పూర్, విశాఖపట్నం, జంషెడ్‌పూర్, పాట్నా, ఇంఫాల్, మీరట్, గౌహతి, పుణె, సిలిగురి, భోపాల్, భుబనేశ్వర్ వంటి సిటీలలో ఇప్పటికే పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. జీఎస్‌టీ, ఇన్‌కంట్యాక్స్‌ల ఎగవేతకే కాకుండా, కంపెనీల నుంచి డబ్బును దారి మళ్లించేందుకు (ఖర్చులు పెంచి చూపించడం ద్వారా) ఫేక్ ఇన్వాయిస్‌లను వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇలా దారి మళ్లించిన డబ్బును హవాలా ద్వారా దేశం బయటకు పంపి వేస్తున్నట్లు కూడా అధికారులు గమనించారు. ఇందుకోసం ఎగుమతులు, దిగుమతులనూ ఎక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఫేక్ ఇన్వాయిస్‌ల ఆధారంగా బ్యాంకుల నుంచి ఎక్కువ అప్పులను కూడా వారు తీసుకుంటున్నారని, ఆ డబ్బును తీసేసుకున్నాక అకౌంట్లను ఎన్‌పీఏలుగా వదిలేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అంటే, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలనూ కూడా వారు మోసగిస్తున్నారన్న మాట. కొంత మంది ఎగుమతిదారులు ఫేక్ ఇన్వాయిస్‌ల సాయంతో ఎక్కువ జీఎస్‌టీ రిఫండ్‌ను, ఎంఈఐఎస్ ఇన్సెంటివ్‌నూ కూడా దక్కించుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ రూల్స్ కఠినం….
ఫేక్ ఇన్వాయిస్‌ల జారీతోపాటు, హవాలా రాకెట్లూ ఊపందుకుంటున్న నేపథ్యంలో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను కొంత కఠినం చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫేక్ ఇన్వాయిస్‌ల జారీ చేసిన వారితోపాటు, బెనిఫిషియరీలపై జీఎస్‌టీ, ఇన్‌కంట్యాక్స్, పీఎల్‌ఎంఏ వంటి చట్టాలతోపాటు, కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ (కోఫెపోసా) కిందా చర్యలు తీసుకునే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మోసపూరితంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని దారి మళ్లిస్తున్న వారిపై దాడులను నవంబర్‌లో డీజీజీఐ ముమ్మరం చేసింది. దొంగ సంస్థలను సృష్టించి, వాటి పేరుతో ఫేక్ ఇన్వాయిస్‌లు జారీ చేయడం ద్వారా సర్క్యులర్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాబోయే రోజులలో ఈ దర్యాప్తును మరింతగా నిర్వహించాలని డీజీజీఐ ఆలోచిస్తోంది. బెనిఫిషియరీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తుందని కూడా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.