చెప్పులు, బట్టలపై జీఎస్టీ పెంపు

చెప్పులు, బట్టలపై జీఎస్టీ పెంపు
  • వీటిపై జీఎస్టీ 12 శాతానికి పెంపు
  • ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ వసూలు
  • వచ్చే జనవరి నుంచి అమలు

న్యూఢిల్లీ: చెప్పులు, బట్టలు, టెక్స్‌‌టైల్స్‌‌ ధరలు పెరగబోతున్నాయి.  ఈ మూడింటిపై జీఎస్టీని 5శాతం నుండి 12శాతం వరకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి నుండి అమలులోకి వస్తాయని తెలిపింది.  ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నోటిఫికేషన్‌‌ రిలీజ్‌‌ చేసింది.  టెక్స్‌‌టైల్స్ (నేసిన బట్టలు, సింథటిక్ నూలు, పైల్ ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, టెంట్లు, టేబుల్‌‌క్లాత్‌‌లు, సర్వియెట్‌‌లు, రగ్గులు  టేప్‌‌స్ట్రీస్ వంటివి)పై ఇక నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.  అప్పారెల్​ జీఎస్టీ రేట్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఏఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది.   జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎస్టీ కౌన్సిల్‌‌ను కోరామని  సంఘం ప్రెసిడెంట్‌‌ రాజేష్ మసంద్ అన్నారు. దుస్తుల తయారీకి వాడే నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా ధరలు పెరిగాయని, ఇన్‌‌ఫ్లేషన్‌‌ వల్ల  సమస్యలు ఎదుర్కొంటున్న తమ ఇండస్ట్రీకి ఇది మరో దెబ్బని అన్నారు. ‘‘జీఎస్టీ రేటు పెరుగుదల లేకున్నా కూడా రాబోయే సీజన్‌‌లో మార్కెట్‌‌లో దుస్తులు ధరలు 15-–20 శాతం పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. రూ.వెయ్యిలోపున్న ఫుట్​వేర్​ ధరలు బాగా పెరుగుతాయి.  భారతదేశ దుస్తుల మార్కెట్‌‌లో 80 శాతానికి పైగా వాటా రూ. 1,000 కంటే తక్కువ ధర కలిగిన దుస్తులదే ఉంటుంది’’ అని ఆయన వివరించారు. టెక్స్‌‌టైల్‌‌ ఇండస్ట్రీలోని ఒక సెక్షన్‌‌కు చెందిన ‘‘ఇన్‌‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌‌’’ను పరిష్కరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సీఎంఏఐ తెలిపింది. ఏరకంగా చూసినా దుస్తులపై జీఎస్టీ పెంపు తప్పుడు ఆలోచన అని స్పష్టం చేసింది. ఈ సెక్షన్‌‌  మొత్తం ఇండస్ట్రీలో 15 శాతానికి మించదని, వీళ్లకోసం మిగతా 85 శాతం మందిపై భారం మోపడం సరికాదని అన్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల మేరకు పన్నురేటును పెంచామని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

వచ్చే ఏడాది నుంచి మరిన్ని మార్పులు
జీఎస్టీ విధానం 2017 జూలై నుంచి అమల్లోకి తెచ్చింది. వచ్చే ఏడాది జూలై నాటికి దీనికి ఐదేళ్లు నిండుతాయి. 2022 నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ కాంపన్సేషన్‌‌ ఇవ్వడాన్ని కేంద్రం ఆపేస్తుంది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని భర్తీ చేయడానికి కేంద్రం కాంపన్సేషన్‌‌ జీఎస్టీ చెల్లిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీలో 5,12,18,28 శాతం శ్లాబులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ఈ శ్లాబులను మార్చడంతోపాటు కొన్ని ప్రొడక్టులకు జీఎస్టీ మినహాయింపును తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు శాతం, 12 శాతం శ్లాబులను కలిపేసి ఒకే శ్లాబుగా మార్చాలనే ఆలోచన కూడా ఉంది. ఇదే జరిగితే జీఎస్టీలో మూడు శ్లాబులు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ రూల్స్‌‌ను మరింత ఈజీగా మార్చాలని, వసూళ్లను పెంచాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రస్తుతం 150 వస్తువులపై, 80 సర్వీసులపై జీఎస్టీ వసూలు చేయడం లేదు. కొన్ని వస్తువులకు మాత్రం టాప్ అప్‌‌ సెస్‌‌ కూడా వసూలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం నాయకత్వంలోని మినిస్టర్స్‌‌ గ్రూపు  ఈ  కొత్త ప్రపోజల్స్‌‌పై శనివారం చర్చించింది. తుది సిఫార్సులను జీఎస్టీ కౌన్సిల్‌‌కు పంపుతుంది. అయితే కాంపన్సేషన్‌‌ జీఎస్టీ ఆగిపోతే తమ ఆదాయాలు విపరీతంగా పడిపోతాయని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. జీఎస్టీ రూల్స్‌‌ మార్చాలని 15వ ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ కూడా సూచించింది. జీఎస్టీ వసూళ్లు ప్రతినెలా పెరుగుతున్నాయి కాబట్టి రేట్లను తగ్గిస్తే మంచిదని టాక్స్‌‌ ఎక్స్‌‌పర్టులు అంటున్నారు.