1 శాతం GST : చిన్న ఇల్లు కొంటేనే వర్తింపు

1 శాతం GST : చిన్న ఇల్లు కొంటేనే వర్తింపు

హైదరాబాద్, వెలుగు: కేంద్రం GSTని తగ్గించినప్పటికీ అది ఎంత మందికి ఉపశమనం లభిస్తుందనేదానిపై రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.హైదరాబాద్‌ ను మెట్రో నగరాల జాబితాలో చేర్చడంతో తగ్గిన GST ధరలు నగరంలో ఎక్కువ మందికి వెసులుబాటు కల్పించకపోవచ్చు. మెట్రో నగరాల్లో 646 చదరపు అడుగులలోపు విస్తీర్ణం కలిగి ఉండి, ధర రూ.45 లక్షల లోపు ఉంటేనే అఫర్డబుల్ జాబితా కింద 1శాతం GST వెసులుబాటును పొందవచ్చు. కానీ హైదరాబాద్ లో ఇంత తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు చాలా తక్కువ. సిటీలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల అమ్మకాలే ఎక్కువ.

దీంతో 1శాతం GST కిందకు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం పూర్తయిన ప్రాజెక్ట్‌‌‌‌కు GST చెల్లించే అవసరం లేదు. కానీ నిర్మాణంలో ఉన్న ఇళ్లు కొనుగోలు చేసినప్పుడు GST చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న  అఫర్డబుల్ ఇళ్లు కొనుగోలు చేసినప్పుడు ఇంతకుముందు 12 శాతం GST చెల్లించాల్సి వస్తుండగా, కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ నుండి వీటిపై 5 శాతం GST మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

నిర్మాణంలో ఉన్న అఫర్డబుల్ ఇళ్లు కొంటే ఇంతకుముందు 8 శాతం GST ఉంటుండగా ఇప్పుడు 1 శాతం GST మాత్రమే కట్టాలి. నాన్ మెట్రో ప్రాంతాల్లో 90 చదరపు మీటర్లు (సుమారు 970 చదరపు అడుగులు), మెట్రో ప్రాంతాల్లో 60 చదరపు మీటర్లు (సుమారు 646 చదరపు అడుగులు) లోపు విస్తీర్ణం ఉండి, రూ.45 లక్షల వరకు ధర ఉన్న వాటిని అఫర్డబుల్ ఇళ్లుగా పరిగణిస్తారు. వీటిపై GSTని 1శాతానికి తగ్గించారు. రూ.45 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల నాన్ అఫరడబుల్ ఇళ్లుగా పరిగణిస్తారు.

మెట్రో నగరాల జాబితాలో కొత్తగా హైదరాబాద్ చేర్చారు . ఇంతకు ముందు ఎక్కువ GST ఉన్నప్పుడు బిల్డర్ మనం కట్టిన GST ద్వారా ఇన్‌‌‌‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ను క్లెయిమ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా నేరుగా నిర్దేశించిన టాక్స్‌‌‌‌నే చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌‌‌‌పుట్ టాక్స్ క్రెడిట్ విధానాన్ని రద్దు చేసింది. దీనిపై బిల్డర్లు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ధరలు తగ్గుతాయని అంటుంటే, మరికొందరు పెద్దగా ఉపశమనం ఉండకపోవచ్చని చెబుతున్నారు .