
GST తగ్గింపుతో మిగిలే డబ్బులతో అంట సొంతింటి కల నెరవేర్చుకోవచ్చంట.. సేవింగ్స్ చేసుకోవచ్చంట.. ఇన్ని రకాలుగా చెబుతున్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారు.. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పెట్రోల్, డీజిల్ లేకుండా బండి నడవదు కదా.. సాయంత్రం అయితే మందు లేకుండా సగం జనం నిద్రపోరు కదా.. మరి అలాంటి పెట్రోల్, డీజిల్, మందు ధరలు ఎందుకు తగ్గలేదు.. GST కింద అన్నీ తగ్గించాం అంటున్న ప్రభుత్వం.. వీటిపై ఎందుకు మౌనంగా ఉంది. ఇదే ఇప్పుడు జనంలో హాట్ హాట్ డిస్కషన్.. ఈ పెట్రోల్, డీజిల్, మందు రేట్లు తగ్గిస్తే ఏకంగా విల్లాలు కొనుక్కోవచ్చు కదా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు సోషల్ మీడియాలో.. మరి వీటికి.. GSTకి ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందామా..
కొత్త జీఎస్టీ రేట్లు దేశవ్యాప్తంగా అమల్లోకి రావడంతో చాలా వస్తువులపై ధరలు తగ్గాయి. కార్ల దగ్గర నుంచి కిరాణా, నిత్యావసరాల దాకా ఎన్నో వస్తువులపై ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. 375 వస్తువులపై ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్.. ఈ మూడింటిపై ఎందుకు ధరలు తగ్గలేదని కొందరిలో సందేహాలున్నాయి. పెట్రోల్, డీజిల్ GST పరిధిలో లేవు. వీటిపై విధించే పన్నులు వేరుగా ఉంటాయి. అందువల్లే.. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తాయి. ఈ కారణంగా.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.
ఉదాహరణకు.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల 46 పైసలు ఉంటే.. ఇదే లీటర్ పెట్రోల్ ధర ముంబైలో 103 రూపాయల 50 పైసలు ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే 94 రూపాయల 77 పైసలు మాత్రమే. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రాల్లో విధించే పన్నులు అక్కడ ఉండవు. అందువల్ల రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎంత పన్ను వసూలు చేస్తుందనే దానిపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. రిటైల్ రేటు అయితే.. డీలర్ కమీషన్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఉంటాయి.
పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు VAT విధిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం విధించే.. ఎక్సైజ్ సుంకం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉన్నప్పటికీ, VAT రాష్ట్రం, రాష్ట్రానికి మారుతుంటుంది. పెట్రోల్, డీజిల్‌ను కూడా GST పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఒక సందర్భంలో ఆలోచన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ వసూలు చేసే ప్రపోజల్‌ను గతంలోనే చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇదే జరిగితే తాము పెద్ద మొత్తంలో రెవెన్యూను కోల్పోవాల్సి ఉంటుందని అన్నాయి.
పెట్రో ప్రొడక్టులపై పన్నులు వసూలు చేసే అధికారాన్ని వదులుకోవడం ఎంతమాత్రమూ ఇష్టం లేదని స్పష్టం చేశాయి. కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూలో అత్యధిక వాటా వీటి నుంచి రావడమే ఇందుకు కారణం. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో దాదాపు 60 శాతం వరకు పన్నులే ఉంటున్నాయి. అందుకే ఈ రెండింటి ధరలు రూ.వంద దాటాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో లేనివి కావడం వల్లే జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చినా ఇంధన ధరలపై ఆ ప్రభావం లేదు. ఇక.. ఆల్కహాల్ ధరలు తగ్గకపోవడానికి కారణం కూడా ఇదే. ఆల్కహాల్పై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే.
ఆల్కహాల్ ఉత్పత్తులపై ఆయా రాష్ట్రాలే పన్నులు విధిస్తాయి. రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో మద్యంపై వచ్చే సంపాదన కోట్లల్లో ఉంటుంది. మద్యం కూడా GST పరిధిలోకి రాదు. మద్యంపై పన్నులు పెంచినా, తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ అధికారం ఉంది. అందువల్లే మద్యం ధరలపై కూడా జీఎస్టీ కొత్త పాలసీ ప్రభావం ఏమాత్రం లేదు. మద్యంపై గోవా అత్యల్ప ఎక్సైజ్ సుంకాన్ని 55 శాతం వసూలు చేస్తుండగా, కర్ణాటక అత్యధికంగా 80 శాతం వసూలు చేస్తుంది.