కేంద్ర ఆరోగ్య మంత్రి సిబ్బందికి కరోనా

కేంద్ర ఆరోగ్య మంత్రి సిబ్బందికి కరోనా
  • ఓఎస్డీ ఆఫీసు మూసివేత

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆఫీస్ సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్)లో కేంద్ర ఆరోగ్య మంత్రికి ప్రత్యేక విధుల్లో ఉన్న ఓఎస్డీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డుకు శనివారం టెస్టులు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఓఎస్డీ ఆఫీస్ ను మూసివేసి శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఓఎస్డీతో సహా ఆఫీస్ సిబ్బంది అందరినీ క్వారంటైన్ కు తరలించారు. శాంపిల్స్ సేకరించి అందరికీ టెస్టులు నిర్వహించనున్నారు. అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ డే కేర్ సెంటర్ లో పనిచేస్తున్న ఒక నర్సుకు, ఆమె ఇద్దరు పిల్లలకు వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ గార్డు, నర్సుకు సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందన్నారు. నర్సుతో సంప్రదించిన ఆసుపత్రిలోని హెల్త్‌కేర్ సిబ్బందితో పాటు డేకేర్ సెంటర్ లో కీమోథెరపీ కోసం వచ్చిన రోగులకు 14 రోజుల పాటు ఇండ్లలోంచి బయటికి రావొద్దని సూచించారు.