అక్రమ మైనింగ్​తో రూ.300 కోట్లు.. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ

అక్రమ మైనింగ్​తో రూ.300 కోట్లు.. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ
  •  సర్కారుకు రూ. 39 కోట్ల రాయల్టీ కూడా 
  • ఎగవేసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • అధికారిక లెక్కల్లో చూపని రూ. 19 లక్షల నగదు స్వాధీనం 
  • బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు  సీజ్ 
  • అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్​లో పెట్టినట్టు గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  పటాన్‌‌‌‌‌‌‌‌చెరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో చేసిన సోదాల వివరాలను ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌తో రూ.300 కోట్లు కూడబెట్టారని గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన మరో రూ. 39.08 కోట్లు ఎగవేసినట్టు వెల్లడించారు. 

మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రొప్రైటర్లుగా ఉన్న సంతోష్‌‌‌‌‌‌‌‌ శాండ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గ్రానైట్‌‌‌‌‌‌‌‌ సప్లై సంస్థలో అక్రమాలకు సంబంధించి గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో మహిపాల్ రెడ్డి బ్రదర్స్, ఇతరుల ఇండ్లు, ఆఫీసులు కలిపి10 ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. 

ఈ సోదాల్లో అధికారిక లెక్కల్లో చూపని రూ. 19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బినామీలుగా అనుమానిస్తున్న వారి పేర్లతో ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పెద్ద సంఖ్యలో సీజ్ చేశామన్నారు. 

అక్రమార్జనతో రియల్‌‌‌‌‌‌‌‌ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు 

సంతోష్‌‌‌‌‌‌‌‌ శాండ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గ్రానైట్‌‌‌‌‌‌‌‌ సప్లై కంపెనీ ప్రొప్రైటర్ గూడెం మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సదరు కంపెనీ లీజ్‌‌‌‌‌‌‌‌ అనుమతి పొందిన స్థలంలో 11,98,743 క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌, రోడ్‌‌‌‌‌‌‌‌ మెటీరియల్‌‌‌‌‌‌‌‌ను తవ్వింది. దీనికితోడు అనుమతి లేకుండానే మరో 4.37 హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులోంచి మరో10,11,672 క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల మెటీరియల్‌‌‌‌‌‌‌‌ను తవ్వి అక్రమంగా విక్రయించింది. 

ఈ అక్రమ దందాతో రూ.300 కోట్లు సంపాదించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. విక్రయాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు లేవని.. అంతా నగదు రూపంలోనే ఈ లావాదేవీలు జరిపినట్టు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ మొత్తం అక్రమార్జన సొమ్మును రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులకు, ఇతర పనులకు వినియోగించినట్టు గుర్తించామన్నారు. సోదాల్లో భాగంగా కొన్ని బ్యాంకు లాకర్లకు సంబంధించిన తాళాలు దొరికాయని ఆఫీసర్లు తెలిపారు. బ్యాంకు లాకర్లు తెరిస్తే మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.