
విద్యాభవన్‌ను ముట్టడించిన గెస్ట్ లెక్చరర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయడంతోపాటు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం నాంపల్లిలోని విద్యాభవన్ ముందు సంఘం నేతలు, సభ్యులు మహా ధర్నా చేశారు.
గెస్ట్ లెక్చరర్ల ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల నుంచి తరలి వచ్చిన గెస్ట్‌లెక్చరర్లు విద్యాభవన్ ముందు ఆందోళన చేస్తుంటే చర్చలకు పిలవకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 863 మంది గెస్ట్ లెక్చరర్లు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని అన్నారు. మార్చిన రూల్స్‌తో కుటుంబాలన్నీ రోడ్డున పడతాయన్నారు. వీరందరినీ క్రమబద్ధీకరించాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. తర్వాత కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో చర్చలు జరిపి, గెస్ట్‌లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య తెలిపారు. ఆరు నెలల జీతం వెంటనే విడుదల చేస్తామని, మిగతా జీతానికి సంబంధించి వివరాలు సేకరించి పది రోజుల్లో చెల్లిస్తామని కమిషనర్చెప్పారన్నారు. అదేవిధంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న గెస్ట్లెక్చరర్లను కొనసాగించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని మిట్టల్హామీ ఇచ్చారన్నారు.