గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మహా సర్కారు కీలక నిర్ణయం

గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికలు.. మహా సర్కారు కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్, నాసిక్, నందూర్బర్, ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ఈ ఉత్తర్వుల్ని పాటించాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1, 5వ తేదీన ఓటింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గుజరాత్ లో ఆరు దఫాలుగా అధికారం దక్కించుకున్న బీజేపీ ఏడోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.