నిన్న కాంగ్రెస్ నేత.. ఇవాళ బీజేపీ మంత్రి

నిన్న కాంగ్రెస్ నేత.. ఇవాళ బీజేపీ మంత్రి

గాంధీనగర్: నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి దూకి 24 గంటలు గడవలేదు. అంతలోనే మంత్రి పదవి వరించింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ 9 నెలల కాలంలో రెండు సార్లు కేబినెట్ విస్తరణ చేపట్టారు. శనివారం ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసమే అన్నట్లు మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఒక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సహా ముగ్గురికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. వారితో శనివారం ఆ రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ ప్రమాణం చేయించారు.

ఇద్దరు కాంగ్రెస్ నేతలకు పదవులు

గుజరాత్ లోని మానవదార్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే జవహర్ చవదా శుక్రవారం ఆ పార్టీకి హ్యాండిచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. గట్టిగా 24 గంటలు గడవకుండానే ఆయన్ని మంత్రి పదవి వరించింది. అలాగే 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో జామ్నగర్ నార్త్ ఎమ్మెల్యే ధవళసిన్హ్ జడేజా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనకు తాజా కేబినెట్ విస్తరణలో సహాయ మంత్రి పదవి దక్కింది.

సహాయ మంత్రిగా బీజేపీ సీనియర్

వడోదరా జిల్లాలోని మంజ్లాపూర్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ సీనియర్ నేత యోగేశ్ పటేల్ కూడా శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు సహాయ మంత్రి పదవిని ఇచ్చారు సీఎం విజయ్ రూపానీ.