గాంధీనగర్: భారత హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) రంగంలో యువత స్కిల్స్ పెంచేందుకు బోష్ హోమ్ కంఫర్ట్ ఇండియా లిమిటెడ్, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర గుజరాత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ప్రధాన కేంద్రాన్ని మెహసాణాలోని గణ్పత్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 2,000 మందికి పైగా విద్యార్థులు, టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తారు. ఈ భాగస్వామ్యంతో స్థానిక ప్రతిభను మెరుగుపరచొచ్చు అని బోష్ ఎండీ సంజయ్ సుధాకరన్ అన్నారు. ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, నానో టెక్ అల్ట్రా సదుపాయాలతో శిక్షణ ఇస్తామని తెలిపారు.
ఇండియాలో హెచ్‌వీఏసీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఆత్మనిర్భర్ భారత్, పీఎల్‌ఐ పథకం, కార్బన్ న్యూట్రాలిటీ 2070 లక్ష్యం వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రంగానికి కొత్త దిశ చూపుతున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం 2030 నాటికి ఈ సెక్టార్ సైజ్ 30 బిలియన్ డాలర్లకు చేరి, ఏడాదికి 15.8 శాతం వృద్ధి సాధిస్తుంది.

