ముగిసిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు

ముగిసిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్ కు తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు కూడా హీరాబెన్ చితికి నిప్పంటించారు. బతికి ఉన్నంతకాలం హీరాబెన్ అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపారు. తన కుమారుడు ప్రధాని అయినప్పటికీ.. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఉండేవారు. ఇప్పుడే అంతే నిరాడంబరంగా ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.

గత రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిదని, సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారని చెప్పారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నానని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు.