కూతురు ఫోన్ చూడకుండా కాపలాగా 4 బౌన్సర్లు.. నెలకు రూ.65వేలు ఖర్చు చేస్తున్న ఫ్యామిలీ

కూతురు ఫోన్ చూడకుండా కాపలాగా 4 బౌన్సర్లు.. నెలకు రూ.65వేలు ఖర్చు చేస్తున్న ఫ్యామిలీ

గుజరాత్‌లో వింత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక 16 ఏళ్ల అమ్మాయి బెడ్‌రూమ్ బయట ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు బౌన్సర్లు షిఫ్టుల వారీగా కాపలా పెట్టింది ఒక ఫ్యామిలీ. అది కూడా నెలకు సుమారు రూ. 65వేలు ఖర్చు పెట్టి మరీ. ఆమెకు ప్రాణహాని ఉందని కాదు.. ఆమె నుంచి ఆమె ఫోన్‌ను దూరంగా ఉంచడానికి, ఆమె హింసాత్మక ప్రవర్తన నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇది. డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఒక వ్యసనంగా మారితే అది ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

డిజిటల్ వ్యసనం..
అహ్మదాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికి సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ అంటే ఎంతటి పిచ్చి అంటే.. ఫోన్ ను ఆమె నుంచి వేరు చేస్తే చాలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇంట్లోని వస్తువులను పగులగొట్టడం, ఎలక్ట్రానిక్ వస్తువులను విసిరేయడం, కుటుంబ సభ్యులపై భౌతిక దాడులకు దిగడం వంటివి చేస్తోందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి ప్రవర్తన కేవలం మొండితనం వల్ల వచ్చింది కాదని.. ఇదొక తీవ్రమైన మానసిక సమస్యగా తేలింది. ఫోన్ ద్వారా వచ్చే వినోదం ఆమెకు ఒక ఎమోషనల్ సపోర్టుగా మారిపోయింది. అది లేకపోతే ఏదో కోల్పోతున్నామనే ఆందోళన, కోపం, హింసాత్మక ధోరణి ఆమెను ఆవహిస్తున్నాయని ఫ్యామిలీ గుర్తించింది.

కుక్కకు కూడా కాపలా.. 
మరో కేసులో గీమింగ్ అడిక్షన్ ఉన్న ఒక టీనేజర్ నుంచి ఇంట్లోని పెంపుడు కుక్కను రక్షించడానికి ఏకంగా 8 మంది బౌన్సర్లను తొమ్మిది నెలల పాటు నియమించాల్సి వచ్చింది. తండ్రి తనను మందలిస్తే.. ఆ తండ్రికి ఇష్టమైన కుక్కపై ఆ కుర్రాడు దాడి చేసేవాడు. ఇలాంటి పరిస్థితులు నేడు అనేక భారతీయ ఇళ్లలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీల సమాచారం ప్రకారం.. ధనవంతుల ఇళ్లలో సెలబ్రిటీల కంటే ఎక్కువగా, మొబైల్ వ్యసనం ఉన్న పిల్లలను నియంత్రించడానికి బౌన్సర్ల అవసరం పెరుగుతోందట. వారు పిల్లలపై చేయి చేసుకోకుండా, కేవలం వారిని నిరోధించడానికి అలాగే ఏం చేస్తున్నారో పర్యవేక్షించడానికి మాత్రమే పని చేస్తారు.

లాక్‌డౌన్ మిగిల్చిన చేదు జ్ఞాపకం..
కరోనా మహమ్మారి తర్వాత పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ఫోన్లకు బందీలు కావడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఆన్లైన్ క్లాసులు, సోషల్ మీడియా, గేమింగ్.. ఇలా ప్రతిదీ డిజిటల్ మయమవ్వడంతో, నిజమైన మానవ సంబంధాల కంటే డిజిటల్ స్క్రీన్‌పైనే వారు ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, చదువులో వెనుకబడటం వంటివి ప్రాథమిక లక్షణాలుగా కనిపిస్తాయి. అయితే ఇవి ముదిరినప్పుడు ఎమోషన్స్‌ని అదుపు చేసుకోలేని స్థాయికి చేరుకుంటారని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్లు తీసేయడం లేదా బౌన్సర్లను పెట్టడం అనేది కేవలం తాత్కాలిక భద్రత మాత్రమే. నిజమైన పరిష్కారం మానసిక వైద్య చికిత్సలోనే ఉంది. అకస్మాత్తుగా ఫోన్లను లాక్కోవడం వల్ల పిల్లలు మరింత హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది. క్రమక్రమంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, శారీరక వ్యాయామం, సామాజిక సంబంధాలను పెంచడం, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. టెక్నాలజీ అనేది మన లైఫ్ స్టైల్ మెరుగుపరచాలి కానీ.. మనల్ని మృగాలుగా మార్చకూడదు. ఈ గుజరాత్ ఘటనలు ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక లాంటివే.