కోల్గేట్ టూత్‌పేస్ట్ కూడా నకిలీ చేస్తున్న కేటుగాళ్లు.. ఫ్యాక్టరీ సీజ్.. ఎక్కడంటే..?

కోల్గేట్ టూత్‌పేస్ట్ కూడా నకిలీ చేస్తున్న కేటుగాళ్లు.. ఫ్యాక్టరీ సీజ్.. ఎక్కడంటే..?

అల్లం పేస్ట్ నుంచి టూత్ పేస్ట్ వరకు ప్రతిదానికీ నకిలీలను పుట్టిస్తున్నారు కేటుగాళ్లు. రోజువారీ వస్తువుల కౌంటర్ ఫీట్ తయారీలో మునిగిపోయిన అనేక గ్యాంగ్స్ ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా నకిలీలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావటం పెరిగిపోయింది. ఇలాంటి ఘటనలు రోజూ వార్తల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. అధికారులు కూడా ఇలాంటి కార్యకలాపాలపై ఫోకస్ చేయటం రైడ్స్ నిర్వహించటంతో నేరగాళ్లు పట్టుబడుతున్నారు. 

తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో భారీ స్థాయిలో నకిలీ కోల్గేట్ టూత్‌పేస్ట్ తయారీ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. గడోదర్ పోలీసు బృందం రాపర్ తాలుకా చిట్రోడ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, నకిలీ టూత్‌పేస్ట్ తయారీని అడ్డుకున్నారు. అచ్చం వర్జినల్ కి ఏమాత్రం తీసిపోని రీతిలో నిందితులు చేస్తున్న ప్రొడక్ట్ ప్యాకింగ్ చూస్తే మీరూ షాకైపోతారు. 

దాడి అనంతరం కంపెనీతో సంప్రదించగా.. అసలు తమకు అక్కడ ఉత్పత్తి కేంద్రాలేమీ లేవని.. ఆ టూత్‌పేస్ట్ ఉత్పత్తులు అసలైనవికావని సంస్థ ధృవీకరించింది. నిందితులు చవక, నాసిరకమైన వస్తువులతో టూత్‌పేస్ట్ తయారు చేసి, వాటిని అసలైన కోల్గేట్ పేరుతో మార్కెట్లో అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తేలింది. పోలీసులు చేపట్టిన దాడిలో దాదాపు రూ.9 లక్షల 43వేలు విలువైన నకిలీ టూత్ పేస్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్, ముడిపదార్థాలు, నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు, తయారీకి ఉపయోగించిన మెషినరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసులు ఈ రాకెట్ కి సంబంధించిన రాజేష్ దియాభాయ్ మక్వానా, సురేష్ మహేశ్‌భాయ్ ఉమాత్, నత్వర్ అజాభాయ్ గోహిల్, నర్పత్ అనే నింధితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై మోసం, కాపీరైట్ ఉల్లంఘనతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలకు సంబంధించిన నేరాలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వీటిని మార్కెట్లోకి ఎవరి ద్వారా ఎలా పంపిణీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వీటి అమ్మకాలు జరుగుతున్నాయనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.