గుజరాత్ లో మొదలైన వానలు.. కచ్ వైపు తుఫాన్.. 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

గుజరాత్ లో మొదలైన వానలు.. కచ్ వైపు తుఫాన్.. 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

గుజరాత్ వైపు దూసుకొస్తున్న బిపర్ జాయ్ తుఫాన్.. తన దిశను మార్చుకున్నట్లు వెల్లడించారు అధికారులు. ముందుగా అనుకున్నట్లు జఖౌ దగ్గర కాకుండా.. దిశ మార్చుకుని కచ్ దగ్గరే తీరం దాటనున్నట్లు చెబుతున్నారు. జూన్ 14వ తేదీ సాయంత్రం 3 గంటల సమయానికి గుజరాత్ తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్ కేంద్రం.. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. అతి తీవ్ర తుఫాన్ గా మారిన బిపర్ జాయ్ తుఫాన్.. విధ్వంసం చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో.. 50 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కచ్ తీర ప్రాంతంలోని ప్రజలు అందరినీ బస్సులు, లారీలు, ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. గుజరాత్ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.

గుజరాత్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయ్యాయి. ద్వారక, కచ్, సౌరాష్ట్ర, రాజ్ కోట్, జాంనగర్, పోరుబందర్, గిర్ సోమనాథ్, జునఘడ్ ఏరియాల్లో వానలు పడుతున్నాయి. 54 తాలూకాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ కనీస వర్షపాతం 6 సెంటిమీటర్లుగా ఉంది. 

తుఫాన్ తీవ్రత దృష్ట్యా 95 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.  11 జిల్లాల పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని లేకపోతే వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. 

తీరంలో అలలు ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది మైకుల్లో ప్రకటిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే ప్రాంతాల్లోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా సముద్రం వైపు వెళ్లొద్దని సూచించారు అధికారులు. 

రెడ్ అలర్ట్ రాష్ట్రాలు :

గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, డామన్ అండ్ డయ్యూ, లక్షదీప్, దాద్రా అండ్ నాగర్ హైవేలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జూన్ 14వ తేదీ రాత్రి నుంచి జూన్ 15వ తేదీ రాత్రి ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.