గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. గిల్ సేనకు తప్పిన ప్రమాదం

గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. గిల్ సేనకు తప్పిన ప్రమాదం

గాంధీనగర్: ఐపీఎల్ 19 ఫైనల్‏ ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (మే 31) రాత్రి అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు ఫైనల్ పోరులో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యా్చ్ అనంతరం జీటీ ప్లేయర్స్ స్టేడియం నుంచి హోటల్‎కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తోన్న టీమ్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.

బస్సులో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుకుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్‎ను బస్సు నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. ఆటగాళ్లు, జట్టు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆటగాళ్లు భయాందోళనకు గురైనట్లు సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా ఆటగాళ్లు గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయారు. 

అనంతరం మరో బస్సులో వారిని హోటల్‎కు తరలించారు. భారత స్టార్ క్రికెటర్స్ గిల్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ క్రికెటర్స్ ఈ ఘటన సమయంలో బస్సులోనే ఉన్నారు. వీరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జీటీ యాజమాన్యం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 

ఆర్సీబీ బ్యాక్ టూ బ్యాక్

ఐపీఎల్‌‌–19లో సమవుజ్జీల సమరం కాస్త ఏకపక్షమైంది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన చూపెట్టిన రెండు జట్ల మధ్య జరిగిన మెగా ఫైనల్లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు పైచేయి సాధించింది. ఛేజ్‌‌ మాస్టర్‌‌, కింగ్​విరాట్ కోహ్లీ (42 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 75 నాటౌట్‌‌) క్లాసికల్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో.. ఆదివారం జరిగిన టైటిల్‌‌ ఫైట్‌‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌పై గెలిచి రెండోసారి టైటిల్‌‌ను సొంతం చేసుకుంది. 

టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 155/8  స్కోరు చేసింది. వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (37 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. ఛేజింగ్‌‌లో బెంగళూరు 18వ ఓవర్లలో 161/5 స్కోరు చేసి నెగ్గింది. వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (16 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుగ్గా ఆడాడు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, వైభవ్​ సూర్యవంశీకి ‘ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్’​ అవార్డులు  లభించాయి.