
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన హిట్టర్ రాహుల్ తెవాటియా (24 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) కొత్త సీజన్‌ను పవర్ హిట్టింగ్తో షురూ చేశాడు..! ఈసారి గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన తెవాటియా తన మార్కు ధనాధన్ ఆటతో టీమ్‌కు విక్టరీ అందించాడు..! 30 బాల్స్‌లో 68 రన్స్ అవసరమైన టైమ్‌లో డేవిడ్ మిల్లర్ (21 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30)తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. గెలుపు ఖాయం అనుకున్న మరో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు షాకిచ్చాడు. తొలుత మహ్మద్ షమీ (3/25) సూపర్ బౌలింగ్‌తో విజృంభించడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయిన లక్నో దాన్ని కాపాడుకునేందుకు చివరి దాకా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది..!
వాంఖడే: రెండు కొత్త జట్ల పోరులో గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ తో సోమవారం జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో 5 వికెట్లతో గెలిచి లీగ్ లో బోణీ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 158/6 స్కోరు చేసింది. దీపక్ హుడా (41 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో55), ఆయుష్ బదోని (41 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. మహ్మద్ షమీ (3/25) మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. వరుణ్ ఆరోన్ (2/45) రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 161/5 స్కోరు చేసి చేసి విజయం సాధించింది. తెవాటియా, మిల్లర్‌తో పాటు హార్దిక్ పాండ్యా (28 బాల్స్ లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 33) ఆకట్టుకున్నారు. షమీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తెవాటియా షో
ఛేజింగ్ ప్రారంభంలోనే గుజరాత్ కు షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (0) ను ఔట్ చేసిన దుష్మంత చమీర.. మూడో ఓవర్లో విజయ్ శంకర్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో ప్లేస్‌లో వచ్చిన కెప్టెన్ హార్దిక్ వెంటవెంటనే రెండు ఫోర్లు బాది లక్నోకు వార్నింగ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (30) తో కలిసిస్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లలో టైటాన్స్ 72/2తో నిలిచింది. కానీ, 11వ ఓవర్లో హార్దిక్ ను ఔట్ చేసిన క్రునాల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాతి ఓవర్లోనే దీపక్ హుడా.. వేడ్ ను క్లీన్ బౌల్డ్ చేసి లక్నోను రేసు లోకి తీసుకొచ్చాడు. మిడిల్ ఓవర్లలో లక్నో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిల్లర్ (21 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30), తెవాటియా సింగిల్స్ కే పరిమితమయ్యారు. దీంతో చివరి ఐదు ఓవర్లలో టైటాన్స్ కు 68 రన్స్ అవసరమయ్యాయి. కానీ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా, మిల్లర్ చెరో ఫోర్, సిక్సర్ బాది గుజరాత్‌ను తిరిగి రేసులోకి తెచ్చారు. ఆపై,17వ ఓవర్లో తెవాటియా 6, 4, 4 కొట్టడంతో ఒక్కసారిగా సమీకరణం మారిపోయింది. తర్వాతి ఓవర్లో మిల్లర్ ను అవేశ్ ఖాన్ పెవిలియన్ పంపాడు. అప్పటికి టైటాన్స్ కు 12 బాల్స్ లో 20 రన్స్ అవసరం కాగా ఆటలో టెన్షన్ పెరిగింది. 19వ ఓవర్లో 9 రన్స్ మాత్రమే రావడంతో చివరి 6 బాల్స్ లో టైటాన్స్‌కు 11 రన్స్ అవసరం అయ్యాయి. అవేశ్ వేసిన చివరి ఓవర్లో అభినవ్ (15 నాటౌట్) మొదటి రెండు బాల్స్ ను ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతిని బౌండ్రీ చేర్చిన తెవాటియా టైటాన్స్ కు విక్టరీ అందించాడు.
ఆదుకున్న హుడా, ఆయుష్
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో ప్రారంభంలో తడబడ్డది. టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో పవర్ ప్లే ముగియకముందే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన బంతి రాహుల్ బ్యాట్ కు తాకి కీపర్ చేతుల్లో పడింది. మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. రివ్యూకు వెళ్లిన టైటాన్స్ సక్సెస్ అయింది. ఆ తర్వాత మూడు, ఐదు ఓవర్లలో క్వింటన్ డికాక్ (7), మనీష్ పాండే (6)లను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ టాపార్డర్ నడ్డి విరిచాడు. నాలుగో ఓవర్లో వరుణ్ ఆరోన్ వేసిన బాల్ ను ఎవిన్ లూయిస్ (10) షాట్ ఆడబోగా అది కాస్తా గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ లో ఉన్న గిల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టడంతో 29 రన్స్ కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది. అనంతరం మిడిలార్డర్ లో దీపక్ హుడా, యంగ్ స్టర్ ఆయుష్ బదోని జట్టును ఆదుకున్నారు. ఎనిమిదో ఓవర్లో తెవాటియా క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన హుడా.. హార్దిక్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్ లోకి వచ్చాడు. ఆపై13వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్, 14వ ఓవర్లో సిక్స్ బాది 36 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన ఆయుష్15వ ఓవర్లో వరుసగా 6,4,4తో పవర్ చూపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కానీ రషీద్ వేసిన 16 ఓవర్లో హుడా ఎల్బీగా వెనుదిరగడంతో ఐదో వికెట్ కు 87 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన క్రునాల్ (13 బాల్స్ లో 21) ఆయుష్ కు అండగా నిలిచాడు.19వ ఓవర్లో సిక్స్ తో ఆయుష్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ చివరి ఓవర్లో ఆయుష్ ను ఔట్ చేసిన ఆరోన్ 9 రన్స్ ఇవ్వడంతో లక్నో 160 మార్కు దాటలేదు.
స్కోరు బోర్డు
లక్నో: రాహుల్ (సి)వేడ్ (బి) షమీ 0, డికాక్ (బౌల్డ్) షమీ 7, ఎవిన్ లూయిస్ (సి) గిల్ (బి) వరుణ్ ఆరోన్ 10, మనీశ్ పాండే (బౌల్డ్) షమీ 6, దీపక్ హుడా (ఎల్బీ) రషీద్ ఖాన్ 55, ఆయుష్ బదోని (సి) హార్దిక్ (బి) వరుణ్ ఆరోన్ 54, క్రునాల్ పాండ్యా (నాటౌట్) 21, చమీర (నాటౌట్ )1, ఎక్స్ ట్రాలు: 4, మొత్తం:20 ఓవర్లలో 158/6; వికెట్ల పతనం: 0–1, 13–2, 20–3, 29–4, 116–5, 156–6 ; బౌలింగ్: షమీ 4–0–25–3, వరుణ్ ఆరోన్ 4–0–45–2, ఫెర్గుసన్ 4–0–24–0, హార్దిక్ 4–0–37–0, రషీద్ ఖాన్ 4–0–27–1
గుజరాత్: గిల్ (సి) దీపక్ (బి) చమీర 0, వేడ్ (బౌల్డ్) దీపక్ 30, విజయ్ శంకర్ (బౌల్డ్) చమీర 4, హార్దిక్ (సి) మనీశ్ పాండే (బి) కృనాల్ 33, మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ ఖాన్ 30, రాహుల్ తెవాటియా (నాటౌట్) 40, అభినవ్ మనోహర్ (నాటౌట్) 15, ఎక్స్ ట్రాలు: 9, మొత్తం : 19.4 ఓవర్లలో 161/5 ; వికెట్ల పతనం: 4–1, 15–2, 72–3, 78–4, 138–5; బౌలింగ్: చమీర 3–0–22–2, అవేశ్ ఖాన్ 3.4–0–33–1,
మోసిన్ ఖాన్ 2–0–18–0, రవి బిష్ణోయ్ 4–0–34–0, క్రునాల్ 4–0–17–1, దీపక్ హుడా 3–0–31–1
? For best results, read this while humming ????? ????? ...????? ???????#SeasonOfFirsts #AavaDe #GTvLSG #TATAIPL pic.twitter.com/zD8yA4CQDg
— Gujarat Titans (@gujarat_titans) March 28, 2022