
నాలుగేళ్లుగా ఇండియా, అమెరికా పోలీసులకు దొరకట్లే
2017 నుంచి ఏటా FBI టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో పేరు
ఇప్పటికీ దొరకని ఆచూకీ.. సమాచారమిస్తే 70 లక్షల రివార్డ్
అటు అమెరికా టాప్ దర్యాప్తు సంస్థ FBI, ఇటు ఇండియా పోలీసులు నాలుగేళ్లుగా వెతుకుతున్నా దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నాడో గుజరాతీ. కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి.. ప్రాణాలు తీసి.. FBI టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులోకెక్కాడు. 2015లో భార్య పాలక్ ను చంపేసి.. కూల్ గా ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ వెళ్లిన భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ ను కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ గా అమెరికా క్రైం రికార్డుల్లో రిజిస్టర్ చేసింది. ఎంతకీ దొరక్కపోవడంతో ఏకంగా రూ.70 లక్షల రివార్డ్ ప్రకటించింది FBI.
డోనట్స్ స్టోర్ లో దారుణంగా హత్య చేసి..
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని విరాంగం ప్రాంతానికి చెందినవాడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ (హత్య చేసే నాటికి 24 ఏళ్ల వయసు). అతడి భార్య పాలక్ (21). 2015లో అమెరికాలోని మేరీలాండ్ లో ఉన్న డోనట్స్ ఫుడ్ స్టోర్ ఈ ఇద్దరూ పని చేసేవారు. ఆ ఏడాది ఏప్రిల్ 12న రాత్రి తన భార్య పాలక్ ను భద్రేశ్ స్టోర్ కిచెన్ లోకి తీసుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ అక్కడ స్టాండ్ వెనుక కెమెరాలు లేవు. సరిగ్గా అక్కడే భార్యకు స్పాట్ పెట్టాడు భద్రేశ్. అత్యంత కిరాతకంగా మొహం మీద కొట్టి హింసించాడు. పైశాచికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.
అంత దారుణం చేసి.. ఏమీ జరగనట్టు!!
భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి.. చాలా కూల్ గా నడుచుకుంటూ వచ్చాడు భద్రేశ్ పటేల్. అక్కడ ఏమీ జరగనట్టు.. ముఖంలో ఏ మాత్రం భయం లేకుండా సీసీ కెమెరాలకేసి చూస్తూ వెళ్లాడు. క్యాబ్ బుక్ చేసుకుని నెవార్క్ ఎయిర్ పోర్టు దగ్గర్లోని ఓ హోటల్ కు వెళ్లి రాత్రంతా రెస్ట్ తీసుకున్నాడు. తెల్లారి మళ్లీ డోనట్స్ స్టోర్ సిబ్బంది వచ్చాక గానీ పాలక్ హత్య సంగతి బయటకు రాలేదు. ఈ లోపు భద్రేశ్ ఫైల్ ఎక్కి పరారయ్యాడు. ఏ దేశమెళ్లాడో నేటికీ తెలియలేదు.
గుజరాత్, మహారాష్ట్రలోనూ సెర్చ్
నాటి నుంచి అమెరికా పోలీసులు ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. లోకల్ కౌంటీ పోలీసులకు భద్రేశ్ ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. దీంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)కి ఆ కేసు బదలాయింపు జరిగింది. నాటి నుంచి ఇటు భారత్ సహాకారం కూడా తీసుకుంటోంది FBI. అయినప్పటికీ కేసు సాల్వ్ కాలేదు. ఇక 2017లో తొలిసారి భద్రేశ్ పేరును టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది FBI. 2018లోనూ, ఇప్పుడు తాజాగా విడుదల చేసిన 2019 లిస్టులోనూ ఉన్నాడు భద్రేశ్. అతడి సమాచారం ఇచ్చిన వారికి రూ.70 లక్షల (లక్ష డాలర్లు) రివార్డు కూడా ప్రకటించింది.
ఇండియా పోలీసుల సహకారం కూడా తీసుకుంటోంది FBI. వేర్వేరు వయసుల్లోని భద్రేశ్ ఫొటోలను ముద్రించి పోస్టర్లు కూడా వేసి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అతడిపై రూ.70 లక్షల రివార్డ్ ఉన్నట్లు ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఫ్రెంచ్ భాషల్లో ముద్రించారు.