ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు.. ఆరో స్థానానికి పడిపోయిన వరల్డ్ చాంపియన్

ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు.. ఆరో స్థానానికి పడిపోయిన వరల్డ్ చాంపియన్

సెయింట్ లూయిస్ (యూఎస్‌‌ఏ): ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌‌లో తడబడ్డాడు. శుక్రవారం జరిగిన బ్లిడ్జ్‌‌ సెక్షన్ తొలి తొమ్మిది రౌండ్లలో కేవలం ఒక విజయం, నాలుగు డ్రాలతో సరిపెట్టుకోవడంతో ఈ టోర్నీలో తను ఆరో స్థానానికి పడిపోయాడు. గుకేశ్ కేవలం డొమింగెజ్‌పై మాత్రమే విజయం సాధించాడు. మరో నాలుగు గేమ్స్‌‌లో ఓడిన అతను 13 పాయింట్లతో వియత్నాంకు చెందిన లీమ్ లే క్వాంగ్‌‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. 

కాగా, అమెరికా జీఎం లెవాన్ అరోనియన్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గురువారం వరకు టాప్‌‌లో ఉన్న ఫాబియానో కరువానా రెండో ప్లేస్‌‌కు పడిపోయాడు. మరో తొమ్మిది బ్లిట్జ్ గేమ్స్‌‌ మిగిలున్న ఈ టోర్నీలో తిరిగి పుంజుకోవాలంటే గుకేశ్ ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది.