
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో... ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఫర్వాలేదనిపించాడు. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఒకదాంట్లో ఓడి రెండింటిని డ్రాగా ముగించాడు. సామ్ షాంక్లాండ్ (అమెరికా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఓడిన గుకేశ్.. వాచిర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్), నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఐదు, ఆరో రౌండ్ గేమ్‌లను డ్రా చేసుకున్నాడు.
ఈ రౌండ్స్ తర్వాత గుకేశ్ ఆరు పాయింట్లతో లినియర్ డొమ్నిగ్వేజ్ పెరెజ్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. యూఎస్ గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువాన (10), లెవాన్ అరోనియన్ (8), సో వెస్లీ (8), వాచిర్ లాగ్రేవ్ (7) టాప్–4లో ఉన్నారు. ర్యాపిడ్‌లో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.