భారత చెస్‌కు కొత్త రారాజు.. విశ్వనాథన్ ఆనంద్‌ను దాటేసిన గుకేష్

భారత చెస్‌కు కొత్త రారాజు.. విశ్వనాథన్ ఆనంద్‌ను దాటేసిన గుకేష్

మూడున్నర దశాబ్దాలుగా భారత చదరంగానికి కర్త, కర్మ, క్రియగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ ఆధిపత్యానికి చెక్ పడింది. అతని శిష్యుడు 17 ఏళ్ల టీనేజ్ యువకుడు గుకేష్ అతన్ని అధిగమించి భారతదేశపు టాప్ ర్యాంక్ చెస్ ప్లేయర్‌గా నిలిచారు. 

ప్రపంచ కప్‌లో భాగంగా అజర్‌బైజాన్‌కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్‌పై విజయం సాధించిన గుకేష్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) తాజా వరల్డ్ ర్యాంకింగ్స్ లో గుకేష్ 9వ స్థానంలోకి దూసుకొచ్చారు. ఇస్కాందరోవ్‍పై విజయంతో గుకేష్ ఖాతాలో 2.5 రేటింగ్ పాయింట్లు చేరడంతో.. అతని రేటింగ్ 2755.9కి చేరింది. దీంతో 2754.0 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న విశ్వనాథన్ ఆనంద్.. అతని తరువాతి స్థానానికి పడిపోయారు.

ఆనంద్ చెస్ అకాడమీలోనే శిక్షణ 

2017 వరకూ విష్ణు చెస్ అకాడమీ(చెన్నై)లో శిక్షణ తీసుకున్న గుకేశ్.. 2019లో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నారు. ఆపై కోవిడ్ కల్లోల సమయంలో విశ్వనాథన్ ఆనంద్ చెస్ అకాడమీలోచేరి అక్కడ మరింత రాటుదేలారు. గతేడాది ఏప్రిల్‌లో ఫిడే ర్యాంకింగ్స్‌లో టాప్ 100లోకి దూసుకొచ్చిన అతను.. ఏడాది కాలంలోనే టాప్ 10లోకి చేరుకోవడం గమనార్హం.