బ్రెడ్‌తో ఎన్నో రకాల రుచికరమైన స్వీట్లు చేయవచ్చు బ్రెడ్ గులాబ్ జామున్, రబ్దీ వంటివి చాలా సులభంగా, తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
బ్రెడ్ తో గులాబ్ జామూన్ తయారీకి కావాల్సినవి
- బ్రెడ్ ముక్కలు: పది
- యాలకుల పొడి: పావు టీస్పూన్
- పిస్తాపప్పులు: రెండు
- పాలు: అరకప్పు
- చక్కెర: ఒక కప్పు
- ఎండుద్రాక్షలు: పదిహేను
- నీళ్లు: ఒకటిన్నర కప్పు
- నూనె: సరిపడా
తయారీ విధానం : పాన్‌లో చక్కెర వేసి నీళ్లు పోసి అది కరిగేవరకు మరిగించాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి కలపాలి. ఒక గిన్నెలో బ్రెడ్ ముక్కల్ని తుంచి వేయాలి. అందులో పాలు పోస్తూ ముద్దగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేసి అరచేతిలో కాస్త అదిమి మధ్యలో ఎండుద్రాక్ష పెట్టి మళ్లీ ఉండ చుట్టాలి. అలా తయారుచేసుకున్న ఉండల్ని వేడి నూనెలో వేసి వేగించాలి. ఆపై వాటిని పాకంలో వేసి కలపాలి.
బ్రెడ్ తో రబ్దీ తయారీకి కావాల్సినవి
- బ్రెడ్ ముక్కలు: ఐదు
- పాలు: లీటరు
- కుంకుమ పువ్వు: చిటికెడు
- చక్కెర: అర కప్పు
- బాదం తరుగు: ఒక టేబుల్ స్పూన్
తయారీ: బ్రెడ్ ముక్కల్ని మిక్సీజార్‌లో వేసి పొడిలా గ్రైండ్ చేయాలి. పాన్‌లో పాలు పోసి కాగబెట్టాలి. తర్వాత పాలలో బ్రెడ్ పొడి వేసి కలపాలి. కుంకుమపువ్వు కూడా వేసి మరోసారి కలపాలి. మరో పాన్‌లో చక్కెర వేసి కరిగేవరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చక్కెర పాకాన్ని పాల మిశ్రమంలో వేయాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక ఒక గిన్నెలోకి తీసుకుని బాదం తరుగును చల్లాలి. ఆ గిన్నెను ఫ్రిజ్‌లో పెట్టి రెండు గంటల తర్వాత తీస్తే.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
