రాహుల్ పాలిటిక్స్ కు పనికిరాడు

రాహుల్ పాలిటిక్స్ కు పనికిరాడు

ఒక్కొక్కరుగా బయటికొస్తరు
పార్టీని చక్కదిద్దే టైమ్​నాయకత్వానికి లేదు
త్వరలో కొత్త పార్టీ : ఆజాద్

న్యూఢిల్లీ : రోగంతో బాధపడుతున్న కాంగ్రెస్​ పార్టీకి డాక్టర్లు కాకుండా కాంపౌండర్లు మందులిస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత గులాంనబీ ఆజాద్​ అన్నారు. పార్టీని చక్కదిద్దే టైమ్​ కూడా కాంగ్రెస్​ నాయకత్వానికి లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు నాయకత్వం వహిస్తున్న వారు పార్టీ సభ్యులు కాంగ్రెస్​ను వీడేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీకి ఇక తాను బెస్ట్​ విషెస్​ మాత్రమే చెప్పగలనని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆజాద్  మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​ పార్టీ పునాది చాలా బలహీనంగా మారింది. పార్టీ ఎప్పుడైనా కూలవచ్చు. అందువల్లే పార్టీని వీడాలని కొంతమంది లీడర్లతో పాటు నేను కూడా నిర్ణయించుకున్నా. కాంగ్రెస్​లో గుమాస్తాగిరి చేస్తూ, ఇతరులకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవాళ్లు ఎక్కువయ్యారు’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపైనా ఆయన తన విమర్శలు కొనసాగించారు. రాజకీయాలపై రాహుల్​కు ఆసక్తి లేనట్లు ఉందని తెలిపారు. ఆయనను లీడర్​గా మార్చేందుకు చాలాసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయిందని వెల్లడించారు. తన డీఎన్ఏను ప్రశ్నించిన వారి డీఎన్ఏను ఆజాద్​ తిరిగి ప్రశ్నించారు. 

బీజేపీలో చేరితే నాకేంటి?
బీజేపీలో తాను చేరబోనని ఆజాద్​ స్పష్టంచేశారు. బీజేపీలో చేరితే కాశ్మీర్​లో తనకు ఉపయోగం ఉండబోదన్నారు. జమ్మూకాశ్మీర్​లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే చాన్సుందని, త్వరలో తాను కొత్త పార్టీ పెడతానని వెల్లడించారు. ‘‘బీజేపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఆ పార్టీ కీలుబొమ్మలే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ చేస్తున్న దుష్ప్రచారమే ఇది. కాశ్మీర్​లోని ఇతర పార్టీలతో మేం చేతులు కలపవచ్చు”  అని ఆజాద్​ చెప్పారు. కాగా, తమపై ఆజాద్​ చేసిన విమర్శలను కాంగ్రెస్​ పార్టీ తిప్పికొట్టింది. కాంగ్రెస్​ను ఆజాద్​ మోసం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనును తాను ఆజాద్​ దిగజార్చుకున్నారని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు.

మోడీ కఠినాత్ముడనుకున్నా.. కానీ మానవత్వం చూపారు
ప్రధాని నరేంద్ర మోడీపై ఆజాద్​ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నేను జమ్మూకాశ్మీర్​ సీఎంగా ఉన్నపుడు కాశ్మీర్​లో ఓ గుజరాతీ బస్సులో గ్రనేడ్​పేలి, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆ సమయంలో మోడీ గుజరాత్​ సీఎంగా ఉన్నారు. పేలుడు జరిగిన తర్వాత ఆయన నాకు ఫోన్​ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కఠినాత్ముడు కాదు, మానవత్వం ఉన్న మనిషి అని నాకప్పుడే అనిపించింది” అని ఆజాద్​ గుర్తు చేసుకున్నారు.