ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నాడు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం పాల్వంచలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఒక మంచి మనిషి రోల్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని శివ రాజ్‌కుమార్ అన్నారు.
‘ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది. నేనేం గొప్ప నాయకుడిని కాదు, అందరిలా సామాన్యుడిని మాత్రమే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని, చూపిస్తారని ఆశిస్తున్నా’ అని గుమ్మడి నర్సయ్య చెప్పారు.
