మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ .. నాలుగు రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ

మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ .. నాలుగు రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ
  •     మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ 
  •     నాలుగు రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ 
  •     హైదరాబాద్​లో ఘటన

ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఇంటి వెనకాల ఉన్న గోడ కూలి, నాలాలో గల్లంతైన మహిళ.. నాలుగు రోజుల తర్వాత మూసీ నదిలో శవమై తేలింది. కవాడిగూడలోని దామోదరం సంజీవయ్యనగర్ కు చెందిన గుండాల లక్ష్మమ్మ (55) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈమె ఇంటి వెనకాల నాలా ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి వెనకాల నిర్మించిన గోడ కూలిపోయింది. ఆదివారం ఇంటికి వచ్చిన లక్ష్మమ్మ కూతురు సుజాత.. తల్లి కనబడకపోవడంతో ఆందోళనకు గురైంది. తన అక్క లక్ష్మితో కలిసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మమ్మ మిస్సింగ్ అయిందా? లేక నాలాలో పడిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

నాలుగు రోజులుగా పోలీసులు, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది లక్ష్మమ్మ ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడికి లక్ష్మమ్మ కూతుళ్లను తీసుకొచ్చి చూపించగా.. పచ్చబొట్టు, ముక్కుపుడక ఆధారంగా చనిపోయింది తమ తల్లేనని గుర్తించారు. డెడ్ బాడీపై పడి కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి వెనకాల ఉన్న గోడ కూలడంతో లక్ష్మమ్మ నాలాలో పడి చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. బాధిత కుటుంబాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. 

ప్రభుత్వానిదే బాధ్యత : సీపీఎం 

లక్ష్మమ్మ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. సంజీవయ్య నగర్ లో సీపీఎం నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేతలు ఎం.శ్రీనివాస్, దశరథ్ మాట్లాడుతూ.. నాలా చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతోనే లక్ష్మమ్మ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతంలో ప్రహరీ నిర్మించాలని కొన్నేండ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.