గ్యాస్ కట్టర్ రంపం బ్లేడుతో బ్యాంకు దోపిడీ.. దొంగ అరెస్ట్

గ్యాస్ కట్టర్ రంపం బ్లేడుతో బ్యాంకు దోపిడీ.. దొంగ అరెస్ట్

గుంటూరు: పలుమార్లు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం గ్యాస్ కట్టర్, రంపం బ్లేడు ఉపయోగించి బ్యాంకు దోపిడీ చేసిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బ్యాంకు లాకర్ ను బద్దలు కొట్టి ఎత్తుకెళ్లిన రూ.23 లక్షల్లో రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసగా మారి చిల్లర నేరాలు చేస్తున్న రాజ్ కుమార్ నిందితుడిగా అనుమానించి అతని కోసం వేటాడిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం పట్టుకున్నారు. 
ఆదివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలోనే పట్టపగలు బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ కత్తితో పొడిచిన ఉదంతం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి నిందితుడు రాజ్ కుమార్ గాంధీ పార్కు సెంటర్ లోని హెచ్ డీఎఫ్ సి బ్యాంకు (HDFC) బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. ముందుగానే రెక్కీ నిర్వహించిన రాజ్ కుమార్ ముసుగు వేసుకుని బ్యాంకు వద్దకు వచ్చి గ్యాస్ కట్టర్, రంపం బ్లేడు ద్వారా బ్యాంకు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. లాకర్ ను కూడా వీటితోనే పగులగొట్టి అందులో ఉంచిన రూ.23 లక్షల నగదు, పలు బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు.

సీసీ కెమెరాలో తన మొహం పడకుండా ముందే జాగ్రత్తపడిన నిందితుడు కెమెరాకు ముందే ప్లాస్టర్ వేసి తన చోరీ చేసిన విషయం రికార్డు కాకుండా జాగ్రత్త వహించాడు. సోమవారం ఉదయమే చోరీ గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి.. పాత నిందితుడేనని అనుమానించారు. పాత నేరస్తుల కోసం వేటాడుతుండగా రాజ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో దొరికిపోయాడు. అతడే బ్యాంకు చోరీ దొంగ అని గుర్తించి.. చోరీ చేసిన డబ్బును, నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.