గురుకులాల్లోని బ్యాక్​లాగ్​పోస్టులు భర్తీ చేయాలి.. గురుకుల అభ్యర్థుల డిమాండ్

గురుకులాల్లోని బ్యాక్​లాగ్​పోస్టులు భర్తీ చేయాలి.. గురుకుల అభ్యర్థుల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: గురుకుల బోర్డు మొండి వైఖరి వీడాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. వెంటనే బ్యాక్​లాగ్​పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరారు. లేని పక్షంలో నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్​స్పందించి గురుకుల అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో గురుకుల అభ్యర్థులు మహాధర్నా చేపట్టారు. ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ, గురుకుల అభ్యర్థులు రాజు, జయశంకర్, సైదులు, హస్మా, మంజుల, జ్యోతి మాట్లాడుతూ.. చాలా మంది ఒకటికి మించి ఉద్యోగాలు సాధించారని, దీంతో బ్యాంక్ లాగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. మొదటగా డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులను వరుస క్రమంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన రెలింక్విషమెంట్ ఆప్షన్​ను పునరుద్ధరించి తదుపరి మెరిట్ లో ఉన్న వ్యక్తిని ఎంపిక చేయాలని కోరారు. ధర్నాకు ఎంపీ ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గురుకుల అభ్యర్థులు అశోక్, సత్యనారాయణ, కాంతారావు, మాధవి, శ్వేత, సుజాత, రాధిక, యామిని, రంజిత తదితరులు పాల్గొన్నారు.