ఉద్యోగాల రోస్టర్  జాబితాల్లో వ్యత్యాసాలు

ఉద్యోగాల రోస్టర్  జాబితాల్లో వ్యత్యాసాలు

9210 పోస్టులకు 9 రకాల పరీక్షలకు గురుకుల నోటిఫికేషన్ జారీ చేశారు. గత ఏడాది నుంచి జాప్యం చేసి ఏప్రిల్ 5న ప్రకటనలు జారీ చేశారు. ఏప్రిల్12 నుంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్17 నుంచి గురుకుల డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు, 24 నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, లైబ్రరీ, మ్యూజిక్, పి. డి, పి.జి. టి పోస్టులకు, 28 నుంచి టి. జి. టి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 9231 పోస్టులకు గాను, 9210 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారు. 21 పోస్టులు తగ్గించినారు. జారీ చేసిన 9210 పోస్టుల్లో 5 రకాల గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల పరిధిలో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.  అన్ని రకాల ఉద్యోగ పరీక్షలకి భిన్నంగా బాలికల గురుకుల, బాలుర గురుకుల అని వేర్వేరు కళాశాలలు, పాఠశాలలు ఉండడం వల్ల సర్విస్ సబార్టినేట్ రూల్స్ 22 ఎ ప్రకారం బాలికల గురుకులాల్లో స్పెషల్ కోటాలో కేవలం మహిళా అభ్యర్ధులకు అవకాశం కల్పించారు. 

దీని వల్ల మొత్తం ఉద్యోగాల్లో 78% అనగా 7150 పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడినవి. మిగిలిన 22% అనగా 2060 పోస్టులలో పురుషులు, మహిళలు ఇద్దరికి అవకాశం ఉంది. ఇందులోనూ 33%  ఓపెన్ పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడినవి. ఉద్యోగ నోటిఫికేషన్లలో రాష్ట్రంలో వర్టికల్ (నిలువు) రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కానీ  గురుకుల నోటిఫికేషన్ లో  సబార్డినేట్ సర్విస్ 22 ఏ ప్రకారం బాలికల గురుకుల పాఠశాలలో మొత్తం పోస్టులు మహిళా అభ్యర్ధులకు రిజర్వు చేశారు. మిగతా జనరల్ గురుకులల్లో మహిళ,పురుష అభ్యర్థులకి అవకాశం ఇచ్చారు.ఇందులో కూడా రోస్టర్ ప్రకారం మహిళా అభ్యర్ధులకు ఎక్కువ పోస్టులు రిజర్వు చేశారు. మొత్తం పోస్టుల్లో 72% మహిళా అభ్యర్థులకు రిజర్వు చేయబడినవి. 

పురుష అభ్యర్థుల్లో నిస్పృహ

గత సంవత్సరం నుంచి అభ్యర్థులు ప్రిపరేషన్ లో ఉన్నారు. ఈ ఖాళీలు రోస్టర్ జాబితా చూసి పురుష అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ లో బాలుర హాస్టల్ వెల్ఫేర్ లో పురుష అభ్యర్థులకి, బాలికల హాస్టల్ వెల్ఫేర్ లో మహళా అభ్యర్థులకు పోస్టులు రిజర్వు చేశారు. జనరల్ హాస్టల్ లో ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. వర్టికల్, హారిజాంటల్ వివాదం  గ్రూప్ 1 తో మొదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లో అధిక పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడినవి. దీంతో పురుష అభ్యర్థులు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ జరిపిన హైకోర్ట్,  గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన  తీర్పు ప్రకారం ఉద్యోగాల భర్తీలో సమాంతర (హారిజొంటల్) విధానం అమలు చేయాలని, వర్టికల్ విధానం చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు ఇవ్వలేదు. 

వర్టికల్,​ హారిజంటల్​లో వ్యత్యాసం

సుప్రీం తీర్పు తర్వాత జారీ అయిన ప్రతి నోటిఫికేషన్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తుది తీర్పు ప్రకారం రోస్టర్ జాబితా ఉంటుందని ప్రతి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కానీ గురుకుల బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ లో బాలుర గురుకుల భర్తీలో గ్రూప్1 తీర్పు అంశం పేర్కొనలేదు. వర్టికల్ లో మహిళా అభ్యర్థులకు ప్రతి ఓపెన్ లో 33% రిజర్వేషన్ల తో పాటు, మహిళా కేటగిరీలో  మళ్ళీ ప్రత్యేకంగా కోటా ఉంటుంది. దీనివల్ల మహిళా అభ్యర్థులకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో 60% వరకు ఉద్యోగాలు వస్తాయి. కానీ హారిజాంటల్ విధానంలో ప్రతి జనరల్ కేటగిరీలో మహిళా అభ్యర్ధులకు 33% తప్పని సరిగా ఉండేలా రోస్టర్ ఉంటుంది. అంతే కానీ మళ్ళీ ప్రత్యేకంగా కోటా ఉండదు. 

రావుల రామ్మోహన్ రెడ్డి 
తెలంగాణ ల రాష్ట్ర బీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు