
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసన మండలి వర్షాకాల సమావేశాలను పాత అసెంబ్లీ బిల్డింగులోనే నిర్వహించనున్నట్లు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలోని పాత భవనంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాల మండలి సమావేశాలను పాత బిల్డింగులో నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందుకే పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భవనాన్ని త్వరగా మండలికి అప్పగించాలని గుత్తా స్పష్టం చేశారు. సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.