ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌లో అడ్డగోలు దోపిడీ : గుత్తా సుఖేందర్ రెడ్డి

 ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌లో అడ్డగోలు దోపిడీ : గుత్తా సుఖేందర్ రెడ్డి
  • ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం వెళ్తే అంగీ లాగు లాక్కొని పంపిస్తున్నరు: గుత్తా సుఖేందర్ రెడ్డి
  • కొత్త డాక్టర్లు ఏడాది పాటు గ్రామాల్లో సర్వీస్ చేయాలని సూచన
  • మండలిలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చ.. మంత్రి దామోదర హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌లో అడ్డగోలు దోపిడీ జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయా హాస్పిటల్స్‌‌‌‌ మధ్యవర్తులకు 60 శాతం దాకా కమీషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొనగా, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్​రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు మాట్లాడారు.

ఈ చర్చలో భాగంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి స్వయంగా తన అనుభవాలను సభలో పంచుకున్నారు. ‘‘ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో పనిచేసే డాక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటారు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌కి వెళ్తారు. దీంతో అక్కడ డాక్టర్లు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌కు వెళితే.. వాళ్ల అంగీ లాగు లాక్కొని బయటికి పంపిస్తున్నారు. కొత్తగా డాక్టర్లు అయిన వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయకుండా మా లాంటి వాళ్ల దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు.

ఎవరూ కూడా మొహమాటానికి పోయి పైరవీలు చేయొద్దు. ‘కంటి వెలుగు’ఈజ్ ఏ గుడ్ ప్రొగ్రామ్. దీనిని ప్రభుత్వం కొనసాగించాలి. జిల్లా హెడ్ క్వార్టర్స్‌‌‌‌లో ఉండే హాస్పిటల్స్, మెడికల్‌‌‌‌ కాలేజీలను​నిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం కార్పోరేట్ హాస్పిటల్స్‌‌‌‌కి వెళ్లరు’’అని పేర్కొన్నారు. 

పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత: మంత్రి దామోదర

పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని హెల్త్‌‌‌‌ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తున్న సబ్ సెంటర్స్, ఆరోగ్య మందిరాలు, సీహెచ్‌‌‌‌సీ కేంద్రాలను, ఏరియా ఆసుపత్రులను, జిల్లా హాస్పిటల్స్‌‌‌‌కు (జీజీహెచ్) అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి రోగానికైనా 90% మంది ప్రజలు జిల్లా స్థాయిలోనే వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, 10 శాతం మందే మాత్రమే తీవ్రమైన రోగాలకు సంబంధించి అత్యవసర చికిత్సల కోసం హైదరాబాద్‌‌‌‌కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి అప్తాల్మజీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను బలోపేతం చేసి, జిల్లా స్థాయిలో అందరికి వైద్య సేవలందిస్తామని చెప్పారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

నిమ్స్ హాస్పిటల్ సంజీవని: మధుసూదనాచారి

నిమ్స్ హాస్పిటల్ సంజీవని వంటిదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందించడంలో వీళ్లు ముందున్నారని వివరించారు. కాకపోతే ఇక్కడ బెడ్స్ సరిపోను లేవని, ప్రభుత్వం స్పెషల్​ ప్రొవిజన్ ఇచ్చి ఈ హాస్పిటల్‌‌‌‌పై ఒత్తిడిని తగ్గించాలని కోరారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. నిమ్స్‌‌‌‌ను ఎయిమ్స్ మాదిరిగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్ రావు మాట్లాడుతూ.. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి వీరి వైద్య సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు.