
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఏకగ్రీవంగా ఎన్నిక
- నేడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తుది గడువు కాగా.. ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు ప్రకటించారు. గతంలో కూడా ఆయన మండలి చైర్మన్‌గా పనిచేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. చైర్మన్‌గా ఎన్నికైన గుత్తాను అభినందిస్తూ సభ్యులు సభలో మాట్లాడుతారు. కౌన్సిల్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికను నోటిఫై చేస్తూ గవర్నర్ తమిళిసై గెజిట్ జారీ చేస్తారు. గెజిట్ వచ్చిన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు చైర్మన్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. కౌన్సిల్ సమావేశాలు మంగళవారం ముగియనున్నాయి. ఈలోగా గవర్నర్ గెజిట్ జారీ చేస్తేనే ఈ సెషన్‌లో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ గెజిట్ లేటైతే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తర్వాత నిర్వహిస్తారని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు.
సభను హుందాగా నడిపిస్త : గుత్తా
శాసన మండలిని హుందాగా, గౌరవ ప్రదంగా నడిపిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రెండోసారి చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కల్పించిన అన్ని పార్టీల సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చైర్మన్‌గా సభ్యులందరినీ సమానంగా చూస్తానన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గతంలో 21 నెలలు చైర్మన్‌గా పనిచేశానని, ఆ అనుభవంతో మరింత హుందాగా సభను నడిపిస్తానని పేర్కొన్నారు.