
- ‘కాళేశ్వరం’లో దోచుకున్న సొమ్ముతో జనగర్జన సభలు: గువ్వల బాలరాజు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ జనగర్జన సభలు పెడుతున్నదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. తాను బండారం బయటపడితే ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి మందిని ముంచే బుద్ధులని మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అచ్చంపేట జనగర్జన పేరుతో ప్రజలకు కేటీఆర్ ఏం సందేశం ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
బీఆర్ఎస్ ను ఎందుకు వీడానో తనకు క్లారిటీ ఉందన్నారు. నాడు విశ్వాసంతో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మారని, కానీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారని ఆరోపించారు. తాను పార్టీ మారి 50 రోజులవుతోందని, అచ్చంపేటకు రావడానికి కేటీఆర్ కు 50 రోజుల సమయం పట్టిందా? అంటూ ఎద్దేవా చేశారు. అచ్చంపేట ప్రజలను కాకుండా ఎక్కడి నుంచి ప్రజలను తెచ్చారని గువ్వల ప్రశ్నించారు. కన్వర్షన్ పేరుతో రూ.వేల కోట్ల భూములను ఏ విధంగా తారుమారు చేశారో అందరికీ తెలుసన్నారు. దీనిపై కేటీఆర్ కు చర్చించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.