
అదో కుక్క.. ఇంట్లో పెంచుకునే కుక్క.. దీనికి అమ్మ, నాన్న ఉన్నారు.. పుట్టిన తేదీ కూడా ఉంది.. దీనికో ఆధార్ నెంబర్ ఉంది.. అంతేనా పాన్ కార్డు కూడా ఉంది. ఇంకా నయం రేషన్ కార్డు ఇవ్వలేదు. బియ్యం కోసం క్యూలో నిల్చునేదని వెటకారం చేయకండి. ఇది నిజం. మధ్యప్రదేశ్ లో కుక్కకు ఆధార్ కార్డ్ మంజూరైంది. ఆ ఆధార్ కార్డులో కుక్క తండ్రి పేరు కూడా ఉంది. మనుషులకే సరిగా లేదు.. కుక్కలకు కూడా ఆధార్ కార్డులు ఇస్తున్నారా అని డౌట్ రావొచ్చు.. వచ్చింది.. ఏం చేస్తాం అలా ఉంది మన దేశంలో పరిస్థితి అన్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ నడుస్తుంది. ఇంతకీ కుక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డు నిజమేనా లేక అబద్దమా.. సోషల్ మీడియా సృష్టినా.. ఇందులో ఏది నిజమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా..
కుక్క ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. ఈ కుక్క పేరు టామీ జైస్వాల్. పుట్టిన తేదీ 2010, డిసెంబర్ 25. కుక్క తండ్రి పేరు కైలాష్ జైస్వాల్. రాష్ట్రం మధ్యప్రదేశ్. నగరం గ్వాలియర్. ఇంటి అడ్రస్ వార్డ్ నెంబర్ 1, సిమారియాతాల్ ఏరియా. గ్వాలియర్ మున్సిపాలిటీ. ఆధార్ కార్డు నెంబర్ 070001051580.
మధ్యప్రదేశ్ సోషల్ మీడియాలో ఈ పోస్టులు దర్శనం ఇచ్చాయి. అసలే నకిలీ ఓటరు కార్డుల వ్యవహారం.. ఓటు చోరీ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన క్రమంలో.. ఇది నిజమే అని డిసైడ్ అయిపోయారు గ్వాలియర్ జనం.. ఇది ఆ నోటా ఈనోటా చివరకు గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ దగ్గరకు చేరింది. కలెక్టర్ మేడం కూడా సీరియస్ గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు.
అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది. అసలు ఆధార్ డేటాలో ఈ నెంబరే లేదంట.. ఈ కుక్క పేరుతో వైరల్ అవుతున్న ఆధార్ కార్డు నకిలీది అని స్పష్టం అయ్యింది. ఎవరో కావాలనే కుక్కకు నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కలెక్టర్ మేడం క్లారిటీ ఇచ్చారు.
ALSO READ : మంచి పని చేసిన ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి !
అది తప్పుడు వార్త అని కలెక్టర్ రుచికా చౌహాన్ స్వయంగా స్పష్టం చేసినా.. గ్వాలియర్ జనం. సోషల్ మీడియా మాత్రం అస్సలు వినటం లేదే.. చనిపోయినోళ్లకు ఓటరు కార్డులు ఉండగా లేనిది.. బతికున్న కుక్కకు ఆధార్ కార్డు ఉంటే తప్పేంటంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆధార్ కార్డు జోక్ అయిపోయిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..
మొత్తానికి గ్వాలియర్ లో కుక్కకు ఆధార్ కార్డు వైరల్ స్టోరీ అనేది ఫేక్.. నకిలీ.. తప్పుడు ప్రచారం.. ఇందులో వాస్తవం లేదు అని మాత్రం తేలిపోయింది. ఆ క్రియేట్ చేసినోడు ఎవడో కానీ.. వీడెవడ్రా ఇంత టాలెంట్ గా ఉన్నాడంటున్నారు నెటిజన్లు.